Begin typing your search above and press return to search.

బిల్లులివ్వండి బాబూ... జేబుకు చిల్లు పడింది

By:  Tupaki Desk   |   30 Dec 2021 2:30 PM GMT
బిల్లులివ్వండి బాబూ... జేబుకు చిల్లు పడింది
X
ఉల్టా సీదా అంటే ఇదే. ఇలాంటి సీన్ తన జీవితంలో ఎపుడూ చూస్తామని కూడా వారు ఎవరూ అనుకోలేదు, బాగానే దర్జా ఒలకబోసారు. ఒకనాడు అందరికీ బాసటగా నిలిచారు. తాము ఉపాధి పొందుతూ పది మందికీ బతుకు దారి చూపించారు. వారే ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు. ఇపుడు వారి పరిస్థితి ఎలా తయారైంది అంటే తాము చేసిన పనులకు బిల్లులు పెట్టి ఏళ్ళు గడుస్తున్నాయి కానీ చేతికి చిల్లి గవ్వ కూడా చేరలేదని వారు వాపోతున్నారు.

మా డబ్బులు మాకిస్తే మా దారి మేము చూసుకుంటాం మహాప్రభో అంటున్నారు. విశాఖ లాంటి మెగాసిటీలో ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకత్వాన కాంట్రాక్టర్లు అతి పెద్ద ఆందోళననే నిర్వహించారు. ఈ ఆందోళనకు పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు వచ్చారు. అంతా నల్ల చొక్కాలు ధరించి వైసీపీ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుని పనులు చేస్తే చివరికి మాకు ఒరిగింది ఇదా అంటూ మండిపడ్డారు.

తాము అప్పులు చేసి పనులు చేశామని, బిల్లులు పెడితే ఇవ్వకుండా ఇలా తిప్పించుకోవడం భావ్యమా మహానుభావా అని ప్రభుత్వ పెద్దలను నిలదీస్తున్నారు. ఒక కాంట్రాక్టర్ దగ్గర చాలా మంది పనులు చేస్తారని,అలా ఎంతో మందికి జీవనోపాధిని కూడా తాము చూపించామని వారు చెప్పారు. అయితే ఈ రోజు తాము నిండా అప్పులతో మునిగిపోయామని, అయినా సర్కార్ పెద్దలకు దయలేదని అవారు అంటున్నారు. అందుకే ఆవేదన-4 పేరిట తాము రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందని వారు అంటున్నారు.


తాము ప్రభుత్వం చెప్పినట్లుగానే నడచుకున్నామని, అన్ని నిబంధనలను పాటించామని కూడా అంటున్నారు. ఆఖరులు తమను రోడ్ల మీదకు తెచ్చేశారని వారు మధనపడుతున్నారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వంలో బిల్లులు ఆలస్యం అయితే ఆయన్ని కలిశామని, ప్రత్యేక జీవో ఇచ్చి మరీ నిధులు విడుదల చేశారని గుర్తు చేస్తున్నారు. తాము నాడు-నేడు, జల్ జీవన్ మిషన్ పనులు చేశామని, అయినా డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ఆలోచించి దశలవారీగా అయినా తమ బిల్లులు చెల్లించాలని ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.

బ్యాంకుల్లో ఆస్తులను కుదువ పెట్టి మరీ పనులు చేశామని, ఇపుడు బ్యాంకుల నుంచి తమకు తాఖీదులు వస్తున్నాయని వారు పేర్కొనడం విశేషం. తాము వేధింపులకు గురి అవుతున్నామని, మానసికంగా ఎంతో నలిగిపోయామని కూడా వారు అనడం గమనార్హం. ఇప్పటిదాకా ప్రభుత్వం తమ బిల్లులను చెల్లిస్తుందేమో అని వేచి చూసి ఎంతో ఓపిక పట్టామని, ఇపుడు తమ ఓపిక నశించిందని, ఇక తాము ఊరుకోమని కూడా వారు ఫైర్ అయ్యారు.

ఒక విధంగా ఏపీలో కాంట్రాక్టర్ల వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారని, ఇక కోలుకుంటుంది అన్న ఆశలు లేకుండా చేస్తున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు అంటే వారు ఎంత ఫ్రస్ట్రేషన్ కి గురి అయ్యారో ఆలోచించాల్సిందే. మొత్తానికి విశాఖ సిటీలో వారి ఆందోళన అందరినీ ఆలోచనలో పడేసింది. దీని తరువాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే కొత్త ఏడాది ఇంతకు మించి ఆందోళన చేపడతామని వారు చెప్పడం విశేషం.