Begin typing your search above and press return to search.

ఏపీలో కాంట్రాక్ట్ బిల్ రాలేదని తాళాలు వేశాడు

By:  Tupaki Desk   |   2 Dec 2021 2:34 PM GMT
ఏపీలో కాంట్రాక్ట్ బిల్ రాలేదని తాళాలు వేశాడు
X
ఏపీలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొన్ని బిల్లులను క్లియర్‌ చేసింది. అయితే, 2019 జనవరి నుంచి చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేసుకునే అవకాశముండేది.

కానీ, ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో బిల్లులు అప్‌లోడ్‌ కావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. బిల్లులు వస్తాయన్న ఆశతో వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ టెండర్లు వేసి పనులు పూర్తి చేశారు. ఇంకా బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని, వడ్డీల భారం పెరిగిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కాంట్రాక్టర్లు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ కాంట్రాక్టర్ తాను నిర్మించిన అంగన్ వాడీ కేంద్రానికి ఏకంగా తాళం వేసి నిరసన తెలిపిన ఘటన వైరల్ అయింది. గిద్దలూరు పరిధిలో మొత్తం 14 అంగన్ వాడీ కేంద్రాలను నిర్మించగా...ఒక్కో కేంద్రానికి దాదాపు రూ.7లక్షలు ఖర్చయిందని, ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తాను కడుపుమండి ఇలా చేశానని సదరు కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఇక, ఇదే తరహాలో మరో పాఠశాల భవనానికి కూడా వేరే కాంట్రాక్టర్ తాళం వేసేందుకు రెడీ అవుతున్నాడట.

ఇక, తమ బిల్లులు చెల్లించాలంటూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నామని తెలియజేస్తూ మున్సిపల్ కార్యాలయం లోపలా, బయటా ఫ్లెక్సీలు అంటించారు. అంతేకాదు, తమ బిల్లులు చెల్లించి, తమ ప్రాణాలు కాపాడాలని వారు ఫ్లెక్సీలో ప్రింట్ చేయించడం పలువురిని కలచివేసింది.