Begin typing your search above and press return to search.

కేబినెట్ భేటీపై చంద్రబాబుకు తేల్చేసిన సీఎస్..!

By:  Tupaki Desk   |   7 May 2019 12:12 PM GMT
కేబినెట్ భేటీపై చంద్రబాబుకు తేల్చేసిన సీఎస్..!
X
ఈ నెల పదో తేదీన ఏపీ కేబినెట్ భేటీ ఉంటుందని ప్రకటిస్తూ, ఆ మేరకు సీఎస్ కు నోట్ పంపించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సదరు సీఎస్ నుంచి స్పందన వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. కేబినెట్ భేటీ విషయంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి తమకు నోట్ వచ్చిన విషయం నిజమేనని ఆయన ధ్రువీకరించారు.

ఈ విషయంలో తమ స్పందనను తెలియజేసినట్టుగా ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. ఈ విషయంలో నిర్ణయాధికారం ఎన్నికల కమిషన్ దే అవుతుందని సీఎస్ తేల్చి చెప్పారు. కేబినెట్ సమావేశంలో ఏ అంశాల గురించి నిర్ణయం తీసుకోవాలో.. తమకు చెప్పాలని - ఆ అంశాలను తాము కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తామని.. అక్కడ నుంచి వచ్చే అనుమతిని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని సీఎస్ వివరించి చెప్పారు!

కేబినెట్ భేటీ విషయంలో తాము పంపించే అంశాలను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం కనీసం నలభై ఎనిమిది గంటల సమయాన్ని తీసుకునే అవకాశం ఉందని ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ సీఎంకు వివరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేసినట్టుగా..తదుపరి అక్కడ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి ఈ అంశంలో ముందుకు వెళ్లడం ఉంటుందని సీఎస్ తేల్చి చెప్పారు.

ఇక ఈ అంశంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేబినెట్ మీటింగ్ పెట్టాలనుకుంటున్న చంద్రబాబు నాయుడి ప్రతిపాదనను ఆయన తప్పు పట్టారు. బాబుకు ఇలాంటి వివాదాలు రాజేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు.