Begin typing your search above and press return to search.

జగన్ ఫీల్ అయ్యేలా ఆమె పని తీరు ఉందా?

By:  Tupaki Desk   |   17 March 2020 3:45 AM GMT
జగన్ ఫీల్ అయ్యేలా ఆమె పని తీరు ఉందా?
X
ఒక రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వాదనను సమర్థవంతంగా వినిపించాల్సి వేళలో.. వారి బాధ్యత మరింత పెరుగుతుంది. ఏపీలో స్థానిక ఎన్నికల్ని ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న వైనంపై జగన్ సర్కార్ ఎంత ఆగ్రహంగా ఉందో తెలిసిందే. ఇలాంటివేళ.. ఏపీ ప్రభుత్వ వాదనను సమర్థవంతంగా వినిపించటంలో ఏపీ సీఎస్ సరిగా వ్యవహరించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీలో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయటం ద్వారా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోతాయన్న వేదనను సీఎం జగన్మోహన్ రెడ్డి వినిపిస్తున్నారు. ఒక అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశంపై మరింత లోతుగా వెళ్లి.. ఆ సమస్య తీవ్రతను చెప్పాల్సిన బాధ్యత సీఎస్ మీద ఉందని.. కానీ తాజా ఎపిసోడ్ లో అలాంటిదేమీ జరగలేదంటున్నారు.

ఏపీలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలంటూ ఏపీ సీఎస్ నీలం సాహ్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు మూడు పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇంత చేసినప్పటికీ.. అందులోని అంశాలు పేలవంగా ఉన్నాయన్న విమర్శ వినిపిస్తోంది. ఎంతసేపటికి కరోనా ప్రభావం లేదనటం.. కరోనా నేపథ్యంలో తీసుకునే జాగ్రత్తలు.. వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా ఉండేలా వ్యవహరిస్తామన్న మాటలే కానీ.. ఎన్నికల వాయిదా కారణంగా ఏపీకి జరిగే నష్టాన్ని ప్రస్తావించకపోటాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందని.. మూడు నాలుగు వారాల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగే వీలుందని చెబుతున్న ఆమె..ఇలాంటివేళలో ఎన్నికల్ని వాయిదా వేయటం వల్ల మున్ముందు ఎలాంటి పరిస్థితి ఉందో అంచనా వేయలేమని చెప్పటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ ఇచ్చిన స్థానిక ఎన్నికల అసైన్ మెంట్ ను సమర్థంగా డీల్ చేయటంలో సీఎస్ తడబడ్డారన్న మాట అధికారపక్ష నేతల నోటి నుంచి వస్తున్న వేళ.. సీఎం ఎలా ఫీల్ అయి ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.