Begin typing your search above and press return to search.

ఈసీకి లేఖ రాయటం..నిబంధనలకు విరుద్ధమేనా?

By:  Tupaki Desk   |   17 March 2020 4:15 AM GMT
ఈసీకి లేఖ రాయటం..నిబంధనలకు విరుద్ధమేనా?
X
ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్ని కరోనా కారణంగా ఆరువారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటం.. దీన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. సీఎం సీరియస్ గా ఉన్న అంశంపై.. తదనంతర చర్యల్లో భాగంగా రాష్ట్ర సీఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయటం తెలిసిందే. వాయిదాను ఎత్తేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన వైనం నిబంధనలకు విరుద్ధమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒకసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. అధికారయంత్రాంగం మొత్తం ప్రభుత్వాధినేతకు కాకుండా ఎన్నికల సంఘానికి జవాబుదారిగా వ్యవహరించాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల సమయంలో నాడు ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు నిర్వహించిన కరువుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తే.. సీఎస్ తో సహా అధికారులు ఎవరూ హాజరు కావొద్దని నాటి ఎన్నికల ప్రధానాధికారిగా వ్యవహరించిన ద్వివేది ఆదేశాల్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం ఆగ్రహాన్ని.. సీఎస్ లేఖ రూపంలోకి ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల్ని ఒక రాష్ట్ర సీఎస్ ధిక్కరించటాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు.. శిక్షణ విభాగం సీరియస్ గా తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీఎం మాటలకు అనుగుణంగా సీఎస్ లేఖ రాయటం ద్వారా.. ఆమె అనవసరంగా చిక్కుల్లో పడ్డారని చెబుతున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా ఎన్నికల సమయంలో ఎన్నిక సంఘానికి ఉండే ప్రత్యేక అధికారాల్ని క్వశ్చన్ చేసేలా సీఎస్ తాజా లేఖ ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి తీరును మొదట్లోనే కంట్రోల్ చేయకుంటే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఎస్ కు కొత్త చిక్కులు తప్పేలా లేవన్న ప్రచారం సాగుతోంది.