Begin typing your search above and press return to search.

స్కాంలో సీఎస్.. టీడీపీ సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   5 May 2019 5:33 AM GMT
స్కాంలో సీఎస్.. టీడీపీ సంచలన నిజాలు
X
ఏపీ సీఎస్ పై తెలుగుదేశం అటాక్ మొదలు పెట్టింది. సీఎం చంద్రబాబును ఎదురించిన దానికి ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా టీడీపీ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. మానవ అవయవాలు అమ్ముకునే వారికి సీఎస్ అండగా నిలిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు గల ఆధారాలను బయటపెట్టి కలకలం రేపారు. ఇప్పుడు ఈ ఆరోపణలు ఏపీలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

టీడీపీ నేతలు జూపూడి ప్రభాకర్ రావు - వేమూరి ఆనంద్ సూర్యలో అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో మానవ అవయవాలను అక్రమంగా దొంగిలించి అమ్ముకునే ముఠాకు సీఎస్ అండగా నిలిచారని ఆరోపించారు. శీనయ్య అనే గిరిజన వ్యక్తి ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే.. డ్రామాలాడి బ్రెయిన్ డెడ్ అని అతడి అవయవాలను ముఠా అమ్ముకుందన్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉందని అతడి భార్య ఫిర్యాదు చేసిందని.. అయితే ఆ ఆస్పత్రి యజమాని పవన్ కుమార్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కలిసి కేసు నీరుగార్చాడని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

సింహపురి యాజమాన్యంతో కలిసి సీఎస్ కొమ్ముకాస్తున్నారని టీడీపీ నేత ఆనంద్ సూర్య ఆరోపించారు. ఒక వర్గంతో కుమ్మక్కై వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. మానవత్వాన్ని మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రి యజామాన్యానికి సీఎస్ వత్తాసు పలికారని దుయ్యబట్టారు.

ఈనెల 23వరకే సీఎస్ ఉంటారని.. అందుకే ఇప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారని జూపూడి ఆరోపించారు. మానవ అవయవాలు అమ్ముకునేవారికి సీఎస్ అండగా నిలవడాన్ని ఖండిస్తున్నామన్నారు. దీనిపై ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ను చెత్తబుట్టలో వేశారని.. మళ్లీ ఎవరి ప్రయోజనాల కోసం సీఎం రిపోర్ట్ కోరారని ప్రశ్నించారు. సీఎస్ పై టీడీపీ ఫిర్యాదు చేస్తుందని స్పష్టం చేశారు.