Begin typing your search above and press return to search.

ఏపీకి మే నెల తెచ్చిన అప్పు 9500 కోట్లు!

By:  Tupaki Desk   |   31 May 2022 7:30 AM GMT
ఏపీకి మే నెల తెచ్చిన అప్పు 9500  కోట్లు!
X
అప్పుల కొండ అంతకంతకూ పెద్దదవుతోంది. ఏ నెలకు ఆ నెల అప్పు లేనిదే ఏపీ బండి కదల్లేని దుస్థితి. ఆర్థిక క్రమశిక్షణ పోయి చాలా కాలమే కాదు.. ఇప్పుడు అప్పుల విషయంలోనూ అలాంటి తీరే నడుస్తోంది. ఒకే ఒక్క నెలలో క్యాలెండర్ లోని 31 రోజులకు ఏపీ రాష్ట్ర సర్కారు చేసిన అప్పు లెక్క తెలిస్తే నోట మాట రాదంతే.

ఏడాది మొత్తంలో అంటే 12 నెలల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం అప్పు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది రూ.28వేల కోట్లు. అంటే.. నెలకు సరాసరిన 2,500 కోట్ల రూపాయిలు (కాస్త ఎక్కువే అయినా.. రౌండ్ ఫిగర్ గా ఉంటుందని ఈ అంకె వేశాం) అలాంటిది మే లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా? అక్షరాల రూ.9500 కోట్లు. అంటే.. తాను నాలుగు నెలల్లో చేయాల్సిన అప్పును కేవలం 30 రోజుల్లోనే చేయటం షాకింగ్ గా మారింది.

గతంలో ఇంత భారీగా ఎప్పుడూ కూడా ఒకే నెలలో ఇంతలా ఏపీ రుణం తీసుకున్నది లేదని చెబుతున్నారు. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఒక నెలలో రాష్ట్రం సొంత పన్నులు.. పన్నేతర ఆదాయం కన్నా తాజాగా తీసుకున్న అప్పే ఎక్కువని చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నెల వారీగా వచ్చే సరాసరి ఆదాయాన్ని చూస్తే రూ.6595 కోట్లు మాత్రమే. ఈ ఏడాది సవరించిన అంచనాల ప్రకారం ఇది కాస్తా రూ.8511 కోట్లుగా చెబుతున్నారు. ఆ లెక్క చూసుకున్నా.. వచ్చేఆదాయానికి మించి మరో రూ.వెయ్యి కోట్లు అదనంగా అప్పు చేసిన పరిస్థితి.

ఈ నెలలో మే 10 నుంచి మే 31 మధ్యలో రూ.9500 కోట్ల అప్పు చేసింది. ఈ రోజు రూ.2500 కోట్లకు (వెయ్యి కోట్ల చొప్పున రెండు.. మరో రూ.500 కోట్లకు) మూడు విడతల్లో అప్పు చేయనుంది. ఈ నెలలో చేసిన అప్పునకు సరాసరిన చెల్లిస్తానని ఒప్పుకున్న వడ్డీ ఎంతో తెలుసా? 7.6 శాతం. అంటే దగ్గర దగ్గర రూపాయి 65 పైసలు అన్న మాట.

ఇక.. తీసుకున్న అప్పులో ఐదేళ్ల వ్యవధిలో తీరుస్తానని వెయ్యి కోట్లకు కమిట్ మెంట్ ఇస్తే.. ఎనిమిది సంవత్సరాలకు మరో వెయ్యి కోట్లు చెల్లిస్తానని చెప్పింది. తొమ్మిదేళ్లకు రూ.2వేల కోట్లు.. పదేళ్లకు రూ.2వేల కోట్లు.. పదకొండేళ్లకు రూ.500 కోట్లు.. పన్నెండేళ్లకు రూ.వెయ్యి కోట్లు.. 19 ఏళ్లకు మరో వెయ్యి కోట్లు.. 20 ఏళ్లకు మరో వెయ్యి కోట్ల అప్పును తీరుస్తామని చెప్పి రుణాన్ని తీసుకుంది. రాష్ట్రానికి ఇప్పటికి ఉన్న అప్పునకు ఈ నెల చేసిన రూ.9500 కోట్లు అదనమన్న మాట.

సాధారణంగా వచ్చే ఆదాయానికి మించిన కొన్ని సందర్భాల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. అది వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ప్రభుత్వాలకు కానీ సర్వసాధారణం. అందుకు భిన్నంగా అప్పు చేయకపోతే ముందుకు అడుగు వేయలేని దీన స్థితికి ఎప్పుడూ చేరుకోకూడదు. అలా చేరితే.. ఏదో రోజు మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాంటి తీరులోనే ఉందన్న మాట వినిపిస్తోంది.