Begin typing your search above and press return to search.

నాలుగు దేశాలకు వెళుతున్న ఏపీ ప్రతినిధులు

By:  Tupaki Desk   |   3 March 2022 5:30 AM GMT
నాలుగు దేశాలకు వెళుతున్న ఏపీ ప్రతినిధులు
X
ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్ధులను క్షేమంగా రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్ధులను పోలండ్, రుమేనియా, స్లొవేకియా, హంగేరి నుండి భారత్ కు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉక్రెయిన్ కు పై నాలుగు దేశాలతో సరిహద్దులున్నాయి. ఇప్పటికే కొన్ని విడతల్లో కేంద్రప్రభుత్వం విద్యార్ధులను దేశానికి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇంకా వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్లోనే ఇరుక్కుపోయున్నారు. వీళ్ళల్లో వందల మంది ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళని సురక్షితంగా తీసుకురావటం కోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం నలుగురిని నియమించింది. హంగేరికి ప్రవాసాంధ్రుల సలహాదారు మేడపాటి వెంకట్, యూరోప్ కు యూరోప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్రరెడ్డి, రొమేనియాకు ప్రవాసాంధ్రుల ఉప సలహాదారుడు చందర్షరెడ్డి, స్లొవేకియాకు నాటా తరపున ప్రవాసాంధ్రుల ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ను పంపుతోంది.

ఈ నలుగురు ఒకటి రెండు రోజుల్లో తమకు కేటాయించిన దేశాలకు బయలుదేరుతున్నారు. ఇందులో భాగంగా నాలుగురికి తాము తీసుకురావాల్సిన విద్యార్థుల జాబితాలను, రాష్ట్రంలో వాళ్ళ తల్లి, దండ్రుల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే అందించింది. వీళ్ళంతా ముందు ఢిల్లీలోని ఏపి భవన్ కు చేరుకుంటారు. అక్కడి నుండి పై దేశాలకు వెళ్ళటానికి ఏపీ భవన్ రెసిడెండ్ కమీషనర్ అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం దగ్గరున్న సమాచారం ప్రకారం ఉక్రెయిన్లో 586 మంది ఏపీ విద్యార్ధులు చదువుకుంటున్నారు.

వీరిలో ఇప్పటికే 555 మంది ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో ప్రభుత్వాధికారులు మాట్లాడారు. ఇపుడు పై దేశాలకు వెళుతున్న ప్రతినిధుల వివరాలను కూడా ప్రభుత్వం విద్యార్ధులతో పాటు ఇక్కడి వాళ్ళ తల్లి, దండ్రులకు కూడా అందించింది. మరి పై దేశాలకు వెళ్ళిన తర్వాత ప్రత్యేక ప్రతినిధులు ఏ మేరకు విద్యార్ధులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటేందుకు సాయం చేస్తారో చూడాలి. ఎందుకంటే విద్యార్ధులు సరిహద్దులు దాటితేనే ప్రత్యేక ప్రతినిధులు వారిని విమానాల్లో తీసుకురాగలరని అందరికీ తెలిసిందే.