Begin typing your search above and press return to search.

ఏపీ డిప్యూటీ సీఎం కులం లెక్క తేలింది.. చివరకు ఏమని తేల్చారంటే?

By:  Tupaki Desk   |   17 May 2021 3:24 AM GMT
ఏపీ డిప్యూటీ సీఎం కులం లెక్క తేలింది.. చివరకు ఏమని తేల్చారంటే?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పుష్ప శ్రీవాణికి తాజాగా బిగ్ రిలీఫ్ లభించింది. ఇప్పటివరకు ఆమె సామాజిక వర్గంపై ఉన్న కన్ఫ్యూజన్.. ఆమెపై ఉన్న ఆరోపణలకు సంబంధించి తాజాగా ఒక స్పష్టత లభించింది. ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన లెక్క తేల్చే విచారణ కమిటీ తాజాగా ఈ వివాదాన్ని కొలిక్కి తీసుకొస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

ఆమె ఎస్టీ కొండదొర కులానికి చెందిన వారిగా నిర్దారించారు. ఎన్నికల సమయంలో ఆమె పొందుపర్చిన సామాజిక వర్గం సరైనదేనని తేల్చారు. డిప్యూటీ సీఎం శ్రీవాణి సామాజిక వర్గంపై న్యాయవాది రేగు మహేశ్ పిటిషన్ దాఖలు చేయటం.. ఆమె తన కులం గురించి తప్పుడు సమాచారం అందించినట్లుగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె సామాజిక వర్గంపై విచారణ జరపాలని పశ్చిమగోదావరి జిల్లా డీఎల్ఎస్ సీకి కోర్టు చెప్పింది.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆమె నిజమైన ఎస్టీ కొండదొర కులస్తురాలుగా తేలింది. ఈ నివేదికను కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు అందజేశారు. విజయనగరం జిల్లా కురుపాం ఎస్టీ నియోజకవర్గం నుంచి పుష్పశ్రీవాణి విజయం సాధించారు. అయితే.. ఆమె తన కులాన్ని తప్పుగా చెబుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా విచారణతో ఆమె కులం మీద ఉన్న సందేహాలు తొలగటమే కాదు.. ఆమె వైపు వేలెత్తి చూపే అవకాశం లేకుండా పోయింది.