Begin typing your search above and press return to search.

డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి కోన రాజీనామా.. కొత్త డిప్యూటీ స్పీక‌ర్ ఈయనే!

By:  Tupaki Desk   |   16 Sep 2022 7:31 AM GMT
డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి కోన రాజీనామా.. కొత్త డిప్యూటీ స్పీక‌ర్ ఈయనే!
X
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి కోన ర‌ఘుప‌తి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం బాప‌ట్ల ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ స్పీక‌ర్‌గా ఎంపిక‌య్యారు. కాగా ఇటీవ‌ల రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలో కొత్త‌గా డిప్యూటీ స్పీక‌ర్‌ను, ప్ర‌భుత్వ చీఫ్ విప్‌ను కూడా ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ చీఫ్ విప్‌గా ఉన్న గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి స్థానంలో న‌రసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు చీఫ్ విప్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న కోన ర‌ఘుప‌తి స్థానంలో విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి డిప్యూటీ స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ అసెంబ్లీ రెండో రోజు స‌మావేశాల్లో భాగంగా డిప్యూటీ స్పీక‌ర్‌కు ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యంది. సెప్టెంబ‌ర్ 16 శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి నామినేష‌న్ వేస్తార‌ని స‌మాచారం. 19వ తేదీ సోమవారం డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక జ‌రుగుతుంది. ఈ మేర‌కు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే వైఎస్సార్సీపీకి శాస‌న‌స‌భ‌లో పూర్తి మెజారిటీ ఉన్న నేప‌థ్యంలో కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఎంపిక లాంచ‌న‌ప్రాయ‌మేన‌ని చెబుతున్నారు. టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపకపోవచ్చ‌ని తెలుస్తోంది. దీంతో కోల‌గ‌ట్ల డిప్యూటీ స్పీక‌ర్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.

కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి చేసిన‌ రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం వెంటనే ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. రెండో విడ‌త మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలోనే కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది.

అయితే అప్పుడు అసెంబ్లీ స‌మావేశాలు లేక‌పోవ‌డం, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. కాగా కోన ర‌ఘుప‌తి బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. కొత్త డిప్యూటీ స్పీక‌ర్‌గా ఎంపిక కానున్న కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి వైశ్య సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు.

కాగా రెండో రోజు శుక్ర‌వారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాల కార్య‌క్ర‌మాన్ని చేపట్టారు. ఈ నేప‌థ్యంలో కడప స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ సభ్యులు ప‌లు ప్రశ్నలు సంధించారు. ఏపీ విభజన చట్టంలో క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామ‌ని కేంద్రం స్పష్టంగా హామీ ఇచ్చింద‌ని టీడీపీ స‌భ్యుడు అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

అయితే కడప స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రాన్ని ప్రభుత్వం ప్రశ్నించట్లేదని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్రంలో గత మూడేళ్ళుగా పెరుగుతున్న నిత్యావసర ధరలపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై తరువాత నిర్ణయం ప్ర‌క‌టిస్తామ‌ని స్పీక‌ర్ తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.