Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టుకు హాజరైన డీజీపీ సవాంగ్ ..ఎందుకంటే !

By:  Tupaki Desk   |   24 Jun 2020 5:00 PM IST
ఏపీ హైకోర్టుకు హాజరైన డీజీపీ సవాంగ్ ..ఎందుకంటే !
X
ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఏపీ హైకోర్టుకు మరోసారి హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణా కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాల అప్పగింతపై హైకోర్టులో పిటిషన్ దాఖలుకాగా ఈ కేసు విచారణకు డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరయ్యారు. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించడం లేదని మంగళవారం పిటిషన్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఇటు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా హైకోర్టు సంతృప్తి చెందలేదు.

దీనితో నేరుగా డీజీపీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో డీజీపీ కోర్టుకు వచ్చారు. వాహనాల సీజ్‌లో పోలీస్ అధికారులు నిబంధనలు పాటించలేదని హైకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. కొందరి పనితీరు సరిగాలేదని.. వాహనాల అప్పగింత జాప్యంపై డీజీపీని వివరణ అడగాలని ఏజీని ఆదేశించామన్నారు.సీజ్ చేసిన వాహనాలను మూడు రోజుల్లో డిప్యూటీ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలని.. వాహనదారులు ఎక్సైజ్ కమిషనర్‌కు అప్లికేషన్ పెట్టుకోవచ్చన్నారు. ఎక్సైజ్ కమిషనర్ సీజ్ చేసిన వాహనాలపై మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు.

అలాగే , డీజీపీ కోర్టుకు హజరు కావాల్సినంత కేసు ఇది కాదని, కానీ కోర్టుకు ఎవరైనా సమానమే అని న్యాయమూర్తి అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నిజాయితీ, నిబద్ధత కలిగిన ఆఫీసర్ అని తనకు తెలుసు అంటూ డిజిపి గౌతం సవాంగ్‌కు కితాబిచ్చారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ శాఖను ఆయన అభినందించారు. డీజీపీ సవాంగ్ కోర్టు ముందు హాజరు కావడం ఇదో మూడోసారి. గతంలో ఓ దంపతులకు సంబంధించి హెబియస్‌కార్పస్ పిటిషన్‌లో.. తర్వాత విశాఖ ఎయిర్‌పోర్టు దగ్గర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్థానిక పోలీసులు నోటీసు ఇవ్వడంపై పిటిషన్ దాఖలుకాగా.. నోటీసు వాళ్లు ఎలా ఇస్తారని వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీని హైకోర్టు రమ్మని కోరింది.