Begin typing your search above and press return to search.

ఐల‌య్య ర‌చ్చ‌...బాబుతో డీజీపీ మీటింగ్‌

By:  Tupaki Desk   |   27 Oct 2017 5:03 PM GMT
ఐల‌య్య ర‌చ్చ‌...బాబుతో డీజీపీ మీటింగ్‌
X
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకాన్ని రచించిన ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురయిన ర‌చ‌యిత‌ - ప్రొఫెస‌ర్ కంచ ఐలయ్య ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. ఈ పుస్తకం కార‌ణంగా వ‌చ్చిన ట్విస్టుల‌కు తోడుగా ఆయ‌న‌కు ఏర్పాటు చేసిన సంఘీభావ స‌భ మ‌లుపులు తిరుగుతోంది. విజయవాడలో నిర్వ‌హించ త‌ల‌పెట్టి ‘కంచ ఐలయ్య సంఘీభావం’ సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ తాను హాజ‌ర‌య్యేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో...ఏపీ పోలీసుల నుంచి నోటీసులందాయి. తార్నాకలోని కంచ ఐలయ్య ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులిచ్చారు. విజయవాడ డీసీపీ క్రాంతి రాణా పేరుతో నోటీస్ ఉంది. సభకు రావాలని ప్ర‌యత్నిస్తే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఈ స‌భ నిర్వ‌హ‌ణ‌ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు తెలిపారు.

మ‌రోవైపు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో రాష్ట్ర డీజీపీ సాంబ‌శివ‌రావు అమ‌రావ‌తిలో స‌మావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య - ఆర్యవైశ్యులు తలపెట్టిన సభలు...శాంతిభద్రతల గురించి సీఎంకు డీజీపీ వివరించారు. ఈనెల 28న కంచ ఐలయ్యకు విజయవాడలో బహుజన వేదిన ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహిస్తున్నారని.. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఐలయ్యకు బ్రాహ్మణసంఘాలు హెచ్చరికలు జారీ చేశాయనే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. బెదిరింపులకు భయపడేదిలేదని ఐలయ్య స్పష్టం చేశారని ఈ నేప‌థ్యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో త‌మ‌కు మార్గ‌ద‌ర్శ‌కం చేయాల‌ని డీజీపీ సీఎం చంద్ర‌బాబును కోరారు. రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు ఎవ‌రు పాల్ప‌డినా..త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు ఈ ప‌రిణామాల‌పై ప్రొఫెసర్ కంచ ఐలయ్య స్పందించారు. శాంతియుతంగా సభ జరుగుతుందని చెప్పినా ఏపీ ప్రభుత్వం ఆ రెండు వర్గాల వైపు ఉంటోందని ఆరోపించారు. త‌న‌కు ష‌ర‌తులు విధించ‌డం వాక్ స్వాతంత్ర్యం ను అడ్డుకోవడమేన‌ని ఐల‌య్య చెప్పారు. విజ‌య‌వాడ‌ సభలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు - ఆదివాసీలు ,గిరిజనులు సమస్యలు పై చర్చించాల‌ని అనుకున్నామ‌న్నారు. తాను, త‌న మిత్రులు - టీమాస్ నాయకులు శ‌నివారం విజయవాడలో జరిగే సంఘీభావ సభకు వెళ్తామ‌ని ప్ర‌క‌టించారు. సభ కోసం అవసరమైన న్యాయపరమైన అంశాలను సిద్దం చేసుకుంటున్నామ‌ని తెలిపారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించగానే మొట్టమొదట ఉన్న చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కు వెళ్తామ‌ని కంచ ఐల‌య్య పేర్కొన్నారు. తాము విజయవాడ సభకు చేరుకునే వరకు భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతామ‌ని ఐల‌య్య వివ‌రించారు. పోలీసుల స్పందనను బట్టి అప్పటికప్పుడు త‌మ తదుపరి కార్యచరణ ప్రకటిస్తామ‌ని తెలిపారు. త‌న‌ను అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని కంచ ఐలయ్య అన్నారు. సభను అడ్డుకుంటే టీమాస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.