Begin typing your search above and press return to search.

రాజధాని కూడా లేని ఏపీ.. ఈ పాపమెవరిది?

By:  Tupaki Desk   |   6 Nov 2019 8:27 AM GMT
రాజధాని కూడా లేని ఏపీ.. ఈ పాపమెవరిది?
X
అమరావతికి పునాది రాయి వేసింది ఒకరు.. నిర్మాణం చేపట్టింది మరొకరు.. ఏపీ కలల రాజధాని సింగపూర్ అంటూ ఉదరగొట్టే ప్రచారం చేశారు.. తీరా ఐదేళ్లు గడిచేసరికి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఏపీ రాజధాని మిగిలిపోయింది.

ప్రధాని నరేంద్రమోడీని తీసుకొని వచ్చి మరీ ఏపీ నూతన రాజధానిగా ‘అమరావతి’కి పునాదిరాయి వేశారు నాటి సీఎం చంద్రబాబు. సింగపూర్ కన్సార్టియంకు భూములిచ్చి కట్టుమన్నారు. ఐదేళ్లలో రాజధాని అతీగతీ లేకుండా ఉంది. పోనీ కనీసం ఏపీకి రాజధాని అమరావతి అని అధికారికంగా చంద్రబాబు నోటిఫికేషన్ కూడా ఆ ఐదేళ్లలో ఇచ్చింది లేదు.

అందుకే తాజాగా కేంద్రం జమ్మూకశ్మీర్ విభజన తర్వాత భారత దేశ మ్యాప్ ను అధికారికంగా విడుదల చేస్తే అందులో ఏపీకి రాజధాని కూడా లేకపోవడం తెలుగు ప్రజలను విస్తుపోయేలా చేసింది. మరి రాజధాని కూడా లేని అమరావతి పాపం ఎవరిదన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

పవన్ కళ్యాణ్ తాజాగా రాజధానికి అడ్రస్ కూడా లేకుండా చేశారు అని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపించారు. ఇక రాజధానిపై నిపుణుల కమిటీని వైసీపీ సర్కారు ఏర్పాటు చేసిందని.. వారు అమరావతిని తొలగించి పులివెందులను రాజధానిగా.. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తారేమో అని సెటైర్లు వేశారు..

పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ధీటుగానే బదులిచ్చింది. అమరావతికి పునాదిరాయి వేసి కట్టింది ఎవరు? ఐదేళ్లలో ఏం ఒరగబెట్టని చంద్రబాబు తప్పులను ఎత్తి చూపకుండా ఆరునెలల వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తావా అంటూ పవన్ ను కడిగిపారేశారు మంత్రులు బొత్స, అవంతిలు.. ఏపీకి రాజధానిగా అమరావతికి కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వని పాపం నీ తెరవెనుక చంద్రబాబుదేనంటూ ధ్వజమెత్తారు.

ఇలా పవన్ కళ్యాణ్ అంటించిన రాజధాని రగడ ఏపీలో మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఐదేళ్లలో రాజధానిని నిర్మించలేని..కనీసం నోటిఫికేషన్ ఇవ్వలేని చంద్రబాబును పల్లెత్తు మాట అనని పవన్ వైఖరి కూడా అందరిలోనూ విస్మయానికి గురిచేస్తోంది.