Begin typing your search above and press return to search.

మోదీ షాలకు ఏపీ డైలామా... ?

By:  Tupaki Desk   |   16 Oct 2021 2:30 AM GMT
మోదీ షాలకు ఏపీ డైలామా... ?
X
ఆంధ్రప్రదేశ్. మరో మారు బీజేపీకి బీపీ పెంచుతోంది. ఆ మాటకు వస్తే ఏపీలో బీజేపీకి ఏం బలముంది ఎందుకు అంత టెన్షన్ అన్న ప్రశ్న రావచ్చు. నిజమే ఏపీలో బీజేపీ అటు అధికార పక్షం కాదు, ఇటు ప్రధాన ప్రతిపక్షం కాదు, ఆ తరువాత వరసలోనూ లేదు. 2014లో 12 సీట్లకు పోటీ చేస్తే నాలుగు మాత్రమే దక్కాయి. ఇక 2019 లో సొంతంగా బరిలోకి దిగితే నోటా కంటే ఓట్ల శాతం తక్కువగా వచ్చింది. ఈ నేపధ్యంలో బీజేపీ ఏపీలో బేఫికర్ గా ఉండాలి కానీ ఇలా ఏంటి అని అనుకోవచ్చు. కానీ బీజేపీ బాధ ఏపీది కాదు, ఢిల్లీది. అంటే 2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి గెలిచి ప్రధాని కావాలని ప్రధాని మోడీ ఆశ పడుతున్నారు. మరి దానికి కావాల్సిన బలమూ, బలగమూ ఇప్పటి నుంచే సమకూర్చుకోవాలి కదా.

ఈసారి కచ్చితంగా బీజేపీకి సొంత మెజారిటీ రాదు అన్న అంచనాలు అటు పార్టీలోనూ బయటా ఉన్నాయి. దాంతో మిత్రులను సంపాదించుకోవాలి. కొత్త మిత్రులను కూడా వెతుక్కోవాలి. అలా కనుక చూసుకుంటే ఏపీలో బీజేపీకి దోస్తులుగా ఇద్దరున్నారు. వారిద్దరు బయటకు కనబడని నేస్తాలు. బయటకు కనిపించేది మాత్రం జనసేన మాత్రమే. ఇక వైసీపీ గత రెండున్నరేళ్ళుగా బీజేపీకి ఎంతలా రాజ్యసభలో మద్దతు ఇచ్చింది లోకమంతా చూసింది. ఒక విధంగా వైసీపీ నమ్మకమైన నేస్తంగా ఉంది.

అయితే ఏపీ వరకూ వస్తే వైసీపీ బయటపడదు, పొత్తులు పెట్టుకోదు, దాంతో ఏపీ నేతలకు మళ్ళీ నోటాతోనే ఫైటింగ్ అన్న పరిస్థితి ఉంటోంది. మరో వైపు చూస్తే టీడీపీ పొత్తులకు సంకేతాలు పంపుతోంది. ఆ రెండు పార్టీల మధ్య జనసేన కూడా ఉంది. ఇలా 2014 నాటి స్నేహాన్ని పునరుద్దరించేందుకు అంతా కలసి చూస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలకు కూడా పొత్తులు అవసరమే. వైసీపీ నో అంటే టీడీపీ వైపు చూడడమే బెటర్ అన్నది కూడా చాలా మంది ఏపీ బీజేపీ నేతల ఆలోచన. కానీ కేంద్ర పెద్దల ఆలోచన వేరేగా ఉందిట.

ఏపీలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు. మోడీ మళ్లీ ప్రధాని కావడమే వారికి ఇంపార్టెంట్. అందువల్ల తొందరపడి ఏపీ నేతల కోసం బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే రేపటి రోజున చంద్రబాబుని నమ్మడం కష్టమే అని మోడీ అమిత్ షాలు ఆలోచిస్తున్నారు అంటున్నరు. అది కూడా నిజమే అనిపించేలా 2018 నాటి అనుభవాలు ఉన్నాయి. నాలుగేళ్ళ పాటు బీజేపీతో దోస్తీ చేసిన చంద్రబాబు సడెన్ గా కాంగ్రెస్ సహా విపక్షాల కూటమి వైపు జరిగారు. 2019 ఎన్నికల్లో మోడీని మళ్లీ పీఎం ని కానివ్వను అంటూ గట్టిగానే చెప్పుకొచ్చారు. అలా దేశమంతా తిరిగారు. కానీ మోడీ వేవ్ బాగా ఉండబట్టి బాబు ప్లాన్స్ పనిచేయలేదు.

ఇపుడు అలా కాదు, కాంగ్రెస్ తో పాటు దేశంలోని బీజేపీయేతర పక్షాలు కూడా బాగానే బలపడ్డాయి. అందువల్ల రేపటి ఎన్నికల్లో ఎవరికైనా ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ ఉంటాయి. దాంతో బాబు ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా జాతీయ రాజకీయాల్లో అప్పటి పరిస్థితులను చూసి మరీ ప్లేట్ ఫిరాయించడన్న నమ్మకం మాత్రం బీజేపీ పెద్దలకు కలగడం లేదుట. దాంతో వారు బాబుతో పొత్తు అంటే కాస్తా సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబుతో కనుక బీజేపీ పొత్తు కలిపితే జగన్ కచ్చితంగా దూరమవుతారు. ఆయన మద్దతు 2024లో అడిగే చాన్స్ అసలు ఉండదు. సో ఇలా ఏపీ రాజకీయం ఎటూ తేలక మోదీ షాలు ఫుల్ డైలమాలో ఉన్నారని టాక్.