Begin typing your search above and press return to search.

ఏపీలో లేఖపై రాజుకున్న రాజకీయం..

By:  Tupaki Desk   |   19 March 2020 6:00 AM GMT
ఏపీలో లేఖపై రాజుకున్న రాజకీయం..
X
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలతో తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏపీలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. మీరు జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాశారని ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖ తాను రాయలేదని స్వయంగా రమేశ్ కుమార్ క్లారిటీ ఇవ్వడం తో ఇప్పుడు ఆ లేఖ అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన రాయని లేఖ ఎవరు రాశారు? ఎవరు సృష్టించారు? అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదంతా టీడీపీ ఆడుతున్న కుట్ర.. నాటకమని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని కోరుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలై లేఖ వైరల్ కాగా ఆ లేఖనే ఇప్పుడు తీవ్ర రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది.

ఆ లేఖ తాను రాయలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ స్పష్టం చేయడం తో వైఎస్సార్సీపీ టీడీపీనే చేసిందని, తమ మద్దతు మీడియా తో ఈ లేఖపై వార్తలు వడ్డించి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై విషం గక్కేందుకు టీడీపీ ఆ పని చేసిందని తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల కమిషనర్ మెయిల్ నుంచే కేంద్ర హోం శాఖకు లేఖ మెయిల్ వెళ్లిందంటూ ప్రచారం సాగినా ఆ లేఖ తాను రాయలేదని రమేశ్ కుమార్ స్పష్టం చేయడం తో టీడీపీనే ఇలా చేయించిందని, దీనిపై ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మొత్తం వ్యవహారం పై విచారణ చేయించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరు తో హఠాత్తుగా తెరపైకి వచ్చిన లేఖ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం సిద్ధం చేశారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డామేజ్ చేసే కుట్రలో భాగంగా దాన్ని సృష్టించారని ప్రభుత్వం భావిస్తోంది. రమేష్ కుమార్ లెటర్ హెడ్ మీద బయటకు వచ్చిన ఈ లేఖ వాస్తవమా..కాదా అని తేల్చేందుకు ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఇది రాజకీయ కుట్రగా భావిస్తూ ఈ కుట్రలో భాగస్వాములను, పాత్రధారులను గుర్తించి దోషులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు సచివాలయానికి ఆదేశాలు వచ్చాయని సమాచారం.

అసలు ఏం జరిగిందనే అంశం పైన నిఘా వర్గాల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ కూడా తాను లేఖ రాయలేదని స్పష్టం చేయడం తో ప్రభుత్వం వేగంగా స్పందించి వెంటనే దాన్ని సృష్టికర్తలను గుర్తించే పనిలో ఉంది. ఆ లేఖలో మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది.. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కుట్రతో రాసినట్లుగా గుర్తించారు. అందుకే దీనిపై వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం ద్వారా వెంటనే చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టింది. అయితే ఈ వ్యవహారం పై రాజకీయంగా దుమారం చెలరేగటం తో కమిషనర్ రమేశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని సమాచారం.

ప్రభుత్వం విచారణ చేపడితే ఎవరూ బయటకు వస్తారో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇలా కక్షపూరితంగా లేఖ సృష్టించడం వెనుక ఉద్దేశం ఏమిటో త్వరలోనే తేలనుంది. ఆ విచారణలో ఏఏ అంశాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.