Begin typing your search above and press return to search.

ఏపీ విద్యావ్యవస్థ దశ మార్చిన జగన్

By:  Tupaki Desk   |   20 Aug 2021 10:00 PM IST
ఏపీ విద్యావ్యవస్థ దశ మార్చిన జగన్
X
ప్రభుత్వ పాఠశాలలలంటే అందరికీ చిన్న చూపే. ఉపాధ్యాయులుండరు.. చదువులు చక్కగా సాగవు. వసతులు, గదులు ఇలా సవాలక్ష కొరతతో కూలీల పిల్లలు సైతం ప్రైవేటు బాట పడుతున్న పరిస్థితులున్నాయి. కానీ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు పోతోంది. ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం.. సరైన బోధనా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇన్నాల్లు పాఠశాలలు కుదేలయ్యాయి. అనేక సంవత్సరాలుగా, అనేక ప్రభుత్వాలు పాఠశాలలను పునరుద్ధరిస్తామని.. పేద వెనుకబడిన తరగతులకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చాయి.

కానీ వారి మాటలు ఇప్పుడు జగన్ సర్కార్ హయాంలో వాస్తవంగా మారాయి. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే తల్లిదండ్రులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పెద్ద హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా నగదు బదిలీ చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని జగన్ ప్రతిజ్ఞ చేశారు.

పాఠశాలలను 'నాడు నేడు' పేరుతో పూర్తిగా నిధులు సమకూర్చి మార్చేశారు. వాటికి రేటింగ్ ఇచ్చారు. పది పాయింట్ల ఫార్ములా తయారు చేశారు. గత రెండు సంవత్సరాలుగా, విద్యా శాఖ జగన్ సంకల్పం నెరవేరేలా చాలా ప్రయత్నం చేసింది. తరగతి గదుల్లో నాణ్యమైన ఫర్నిచర్, మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన వంటగది, పోషక ఆహారం, కాంపౌండ్ వాల్, పునర్నిర్మాణం, మెరుగైన పరికరాలతో పాఠశాలలు పటిష్టమయ్యాయి. చాలా సమస్యలు పరిష్కరించబడ్డాయి.

ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రవేశాలకు డిమాండ్ పెరిగింది ఎంతలా అంటే ప్రభుత్వ పాఠశాలల ముందు 'NO VACANCY' బోర్డులను పెట్టే అంతగా.. ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం ఇప్పుడు డిమాండ్ ఇంకా ఎక్కువగానే ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు పోటీపడుతూ దక్కకపోతే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఈ అసౌకర్యానికి తల్లిదండ్రులు సహకరించాలని పాఠశాలలు కోరుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఏపీ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఈ ప్రమాణాలను నిర్వహిస్తుందని ఆశిస్తున్నాము. అదే జరిగితే ఏపీ విద్యావ్యవస్థ, విద్యార్థుల తలరాత మారినట్టే..