Begin typing your search above and press return to search.

ఎస్‌ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌ ఇక సర్దు కోవాల్సిందేనా..?

By:  Tupaki Desk   |   10 April 2020 7:30 AM GMT
ఎస్‌ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌ ఇక సర్దు కోవాల్సిందేనా..?
X
ఏపీలో కరోనా అలజడి సృష్టిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయం కూడా హాట్ హాట్ గా సాగుతుంది. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలలో బాగా వినిపిస్తున్న పేరు ఏది అంటే .. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్‌ ఈసీ) ర‌మేష్‌కుమార్. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ ఈ సీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవడడం రాష్ట్రంలో పెను సంచలనానికి దారి తీసింది. ఈ విషయంలో రమేష్ కుమార్ పై సీఎం జగన్ విమ‌ర్శ‌లు గుప్పించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సామాజిక వర్గం నేత అయిన చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారని సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు.

దీనిపై రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ఎస్ఈసీకి కూడా కులం అంటగడతారా అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనితో త్వరలోనే ఆయన్ని మారుస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా రమేష్ కుమార్ ను తొలగించడానికి జ‌గ‌న్ స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం. ఆర్డినెన్స్ ద్వారా ఆయనను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994లో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రన్సిపల్ సెక్రటరీ స్థాయి - ఆ పై అధికారి మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ గా నియమించడానికి అర్హులు. అంటే ఓ రకంగా బ్యూరోక్రాట్లు మాత్రమే ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. అయితే, జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే ఆర్డినెన్స్ ద్వారా హైకోర్టు జడ్జిగా పనిచేసిన వారికి మాత్రమే ఎస్ ఈ సీగా పనిచేసే అవకాశం దక్కనుంది. దీన్ని అస్త్రం గా చేసుకొని జగన్ సర్కార్ ర‌మేష్‌ కుమార్‌ ను సాగ‌నంపేంద‌కు రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తాజా స‌మాచారం.

దీంతోపాటు ఎస్ ఈ సీ పదవీకాలం అంశంలో కూడా మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఐదేళ్లు పదవీకాలం ఉంది. అయితే, దాన్ని మూడు సంవత్సరాలకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే, ఆరేళ్లకు మించి ఆ పదవిలో ఉండడానికి వీల్లేకుండా ఆర్డినెన్స్‌ లో పొందుపరిచే అవకాశం ఉంది. ఈ మేర‌కు ఫైల్‌ ను సిద్ధం చేసినట్లు వార్త‌లు వస్తున్నాయి. ఈ ఫైల్‌ ను గవర్నర్ ఆమోదం కోసం జగన్‌ ప్రభుత్వం పంపిన‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఆమోదం పొంది అమల్లోకి వస్తే రమేష్ కుమార్ ఆ ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సిందే. అయితే , ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కొందరు న్యాయ నిపుణులు విమర్శలు చేస్తున్నారు. చూడాలి మరి ఏమౌతుందో ..?