Begin typing your search above and press return to search.

ఐఆర్ అంటే.. వ‌డ్డీ లేని అప్పా.. ఏపీ స‌ర్కారు పై ఉద్యోగ సంఘాల నేత‌లు ఫైర్‌

By:  Tupaki Desk   |   5 Feb 2022 3:31 AM GMT
ఐఆర్ అంటే.. వ‌డ్డీ లేని అప్పా.. ఏపీ స‌ర్కారు పై ఉద్యోగ సంఘాల నేత‌లు ఫైర్‌
X
రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐఆర్ అంటే.. వ‌డ్డీలేని రుణాలా? అని నిల‌దీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు పీఆర్సీలను కోల్పోయారని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. స్టీరింగ్‌ కమిటీ ముగిసిన అనంతరం.. నేతలు మీడియాతో మాట్లాడారు. వేతన సవరణ తేదీకి.. అమలు తేదీకి ప్రభుత్వాల వ్యత్యాసం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్‌ లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని వ్యాఖ్యానించారు. సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని నేతలు స్పష్టం చేశారు.

స‌మ్మె కాలానికి జీతాలు మిగుల్చుకుందామ‌ని: బొప్ప‌రాజు

రాజకీయ ప్రసంగాలు చేస్తూ సమస్యను ప్రభుత్వం జఠిలం చేస్తుందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలు ఉద్యోగులకు అక్కర్లేదని.. సమస్యల పరిష్కారమే కావడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ``వాస్తవాలు బయటపెట్టకుండా ఉద్యోగులను కించపరుస్తున్నారు. చర్చల పేరిట ఉద్యోగులను అవమానపరుస్తున్నారు. బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా..? చర్చలకు పిలిచి చాయ్‌, బిస్కెట్‌ ఇచ్చి పంపుతున్నారు. సమ్మెలోకి వెళ్తే జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. మొన్న చర్చలకు వెళితే అరగంటలో మాట్లాడి చెబుతామన్నారు. ఆరు గంటలైనా సమస్య పరిష్కారం చేయలేదు. సజ్జలకు ఫోన్‌ చేస్తే.. అయ్యో! మీరింకా అక్కడే ఉన్నారా `` అని ప్రశ్నించారు.

ఉద్య‌మాన్ని చంపే ఎత్తుగ‌డ‌లు: బండి శ్రీనివాసరావు

అనమోలిస్‌ కమిటీ అంటున్న అధికారులకు దానిపై అవగాహన లేనట్టుందని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వేతన సవరణలో ఒక సీనియర్‌ ఉద్యోగికి జూనియర్‌ కన్నా అన్యాయం జరిగితే దానిని పరిష్కరించడానికి ఆ కమిటీ పని చేస్తుందన్నారు. ఉద్యోగుల ఉద్యమాన్ని చంపేందుకు ప్రభుత్వం కొన్ని ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు అనామలిస్‌ కమిటీ ఎక్కడుందో ఉద్యోగులు వెతుక్కోవాలా? అని ప్రశ్నించారు. వేతన గణన అనేది అర్థం కాని బ్రహ్మపదార్థంలా అధికారులు మార్చేశారని విమర్శించారు. అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను పక్కన పెట్టి అధికారుల కమిటీ నివేదిక అమలు చేసి అన్యాయం చేశారని చెప్పారు. ఉద్యోగులను భయపెట్టేలా బదిలీలు చేసేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.

ఐఆర్ ఎప్పుడూ వెన‌క్కి తీసుకోలేదు: సూర్యనారాయణ

గతంలో ఎప్పుడూ మధ్యంతర భృతి వెనక్కి తీసుకోలేదని సూర్యనారాయణ గుర్తు చేశారు. మధ్యంతర భృతి(ఐఆర్‌) వడ్డీ లేని అప్పు అని మాకు తెలియదని చెప్పారు. మధ్యంతర ఉపశమనం ఏ రకంగా రుణంగా కనిపించిందో అధికారులు చెప్పాలని పేర్కొన్నారు. ఐఏఎస్‌లా గొప్ప చదువులు చదవకపోయినా ఇది సాధారణ లెక్కలేనని ప్రతి ఉద్యోగికీ తెలుసునన్నారు. ఐఆర్‌ జీవోలో ఒక తరహాగా గత పీఆర్సీలో ఒకలా ఉండటం తప్పుదోవ పట్టించడమే అవుతుందని చెప్పారు. జీవోను నిలుపుదల చేయాలని చెప్పినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు. కేంద్ర పే కమిషన్‌కు వెళ్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

పీఆర్సీకి డీఏకి ఏదన్నా సంబంధం ఉందా: వెంకట్రామిరెడ్డి

మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్‌లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని మరో నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీకి డీఏకి ఏదన్నా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికి కేంద్రం ఆదేశాల మేరకు చెల్లింపు ఉంటుందన్నారు. సీఎం చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలీదని, ఉద్యోగులకు మాత్రమే వారి వేతన వివరాలు తెలుస్తాయని చెప్పారు. "ఐఆర్‌ అనేది వడ్డీలేని రుణమని సీఎస్‌ చెప్పడం బాధాకరం. పీఆర్సీ సమయానికి అమలు కాకపోతే మధ్యంతర భృతి ఇస్తారు. ఉద్యోగులకు జీతంలో భాగంగా ఇచ్చేది అప్పుగా భావిస్తారా? ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించట్లేదు. పీఆర్సీకి డీఏకు సంబంధం ఉందా అనేది చెప్పాలి. కొత్త పీఆర్సీ ప్రకారం డీఏ అమలు చేయాల్సి ఉంటుంది. పాత స్కేల్‌ ప్రకారం డీఏ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదా? డీఏలతో సంబంధం లేకుండా పీఆర్సీని పరిగణనలోకి తీసుకోవాలి`` అన్నారు.