Begin typing your search above and press return to search.

'ఓపెన్' అయిన బండి..బొప్పరాజు.. ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   28 Feb 2022 7:06 AM GMT
ఓపెన్ అయిన బండి..బొప్పరాజు.. ఏం చెప్పారంటే?
X
ఏం జరిగినా.. తనకు పట్టనట్లుగా వ్యవహరించే గుణం మోతాదుకు మించినట్లుగా ఉండే తీరు ఆంధ్రోళ్లలో ఎక్కువన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంుటంది. తెలంగాణ ప్రజల మాదిరి ఏపీ ప్రజలు చైతన్యవంతులుకారని.. జరిగే నష్టాల మీద స్పందన మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి వెంటనే రాదన్న విషయం తెలిసిందే. అప్పటివరకు తమకేం పట్టనట్లుగా ఉంటూ.. చూసిచూడనట్లుగా వ్యవహరించే ఆంధ్రోళ్లు.. ఏదైనా విషయంలో రియాక్టు అయితే మాత్రం.. పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి తెలిసేలా చేయటం తెలిసిందే.

వైఎస్ జగన్ సర్కారు విడుదల చేసిన పీఆర్సీ నివేదిక ప్రకారం తమకు వచ్చే జీతం కంటే తక్కువే వస్తుందన్న మాటతో తీవ్ర నిరాశకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు.. జగన్ సర్కారుపై సమర శంఖాన్ని పూరించటం.. సొంతంగా నిరసన ర్యాలీ.. ధర్నాలను నిర్వహించటం.. అది కాస్తా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. ప్రభుత్వం.. పోలీసులు ఎంతగా నిర్భంధించి.. ఉక్కుపాదం మోపినా.. తాము అనుకున్నట్లుగా నిరసనను చేపట్టటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకులుగా నిలిచే వారిలో ఏపీ ఉద్యోగ సంఘాలకు చెందిన బండి శ్రీనివాసరావు.. బొప్పరాజులు కీలక భూమిక పోషించారనే చెప్పాలి. అదే సమయంలో జగన్ ప్రభుత్వంతో కుమ్మక్కు అయినట్లుగా విమర్శలు.. ఆరోపణల్ని పెద్ద ఎత్తున ఎదుర్కొన్నది కూడా వారే కావటం గమనార్హం. ఇదిలాఉంటే.. తాజాగా ఒక ప్రముఖ చానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమానికి హాజరైన వారు.. తమ మనసులోని విషయాల్నివెల్లడించేందుకు ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ చెప్పిన మాటల్లోని కీలకమైన వ్యాఖ్యల్ని చూస్తే..

- పీఆర్‌సీకి సంబంధించి రాష్ట్రప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తాము కొత్తగా సాధించిందేమీ లేదు. అయితే పోగొట్టుకున్నవి ఉద్యమించి సాధించుకున్నాం. ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం పుణ్యమే. సీఎం జగన్‌ ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌పై సంతృప్తిగా లేకున్నా.. 2023లో ఎక్కువ సాధిస్తాం.

- కొత్త వేతన సవరణ కమిషన్‌ను 2023లో వేస్తారు. రెండు ఇంక్రిమెంట్లు కోల్పోవలసి వస్తోందనే ఉపాధ్యాయ నేతలు వ్యతిరేకించారు. పీఆర్‌సీపై సీఎం జగన్మోహన్‌రెడ్డిని అధికారులు తప్పుదోవ పట్టించారు. ఆయనకు మేం క్షమాపణలు చెప్పలేదు.

- పోగొట్టుకున్నవి ఉద్యమించి సాధించుకున్నాం.. ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేం లేదు. ఆశ్చర్యం ఏమంటే.. ఇవ్వని ప్రభుత్వం మీద కాకుండా మా మీద కోపం ఎందుకో అర్థం కాదు.

- ఏపీ రాజధాని మాకు అయితే (ప్రభుత్వ ఉద్యోగులకు) అమరావతే. గతంలో అమరావతే అన్నారు. ఇప్పపుడేమో అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటున్నారు. చివరకు ప్రజలే నిర్ణయిస్తారు.

- అమరావతిలో రాజధానికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోడీ. ఇప్పుడేమో కేంద్రంలోని బీజేపీ ప్రభతు్వం రాజధాని రాష్ట్రం ఇవ్వమని చెబుతోంది. ఉద్యోగుల వరకైతే మాత్రం.. ఇల్లు ఇవ్వమని అడుగుతున్నాడంతే.

- ప్రభుత్వంతో చర్చలతో మేం చాలా సక్సెస్ అయ్యాం. మొదటి జీవోలో పదేళ్ల పీఆర్సీ అన్నారు. దానిని ఐదేళ్లకు తగ్గించుకోగలిగాం. ఐదేళ్ల పీఆర్సీ తిరిగి తెచ్చుకోవటం అచీవ్ మెంట్ కాదు. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు.. మేం పోగొట్టుకున్నవి సాధించామే కానీ కొత్తగా సాధించామనలేదు.

- తెలంగాణ కంటే ఏపీ ఉద్యోగులకు జీతాలు తగ్గలేదు. పెరిగాయి. ఐదు డీఏలు రావటంతో మా జీతాలు వాళ్ల కంటే ఎక్కువే అయ్యాయి. డీఏలు ఎప్పుడైనా ఇవ్వాలి కాబట్టి ఒకేసారి ఐదు డీఏలు ఇచ్చేసి వీటిని తగ్గించాలని నిర్ణయించారు.