Begin typing your search above and press return to search.

అర్థరాత్రి ఒంటి గంట వరకు చర్చలు.. ఇరు వర్గాలు చెప్పిందేమిటి?

By:  Tupaki Desk   |   5 Feb 2022 5:31 AM GMT
అర్థరాత్రి ఒంటి గంట వరకు చర్చలు.. ఇరు వర్గాలు చెప్పిందేమిటి?
X
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహానికి గురి కావటం.. ఇప్పటికే భారీ నిరసనతో తమ వైఖరిని స్పష్టం చేయటం తెలిసిందే. ఈ నెల ఆరు నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లుగా పేర్కొంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ.. పీఆర్సీ సాధన సమితి నాయకుల మధ్య చర్చలు భారీ ఎత్తున సాగాయి. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు మొదలైన చర్చలు అర్థరాత్రి ఒంటి గంట వరకు సాగాయి. అయినప్పటికి హెచ్ఆర్ఏ.. సీసీఏ తదితర అంశాలపై స్పష్టత రాకపోవటం.. మంత్రుల కమిటీ నుంచి కొన్ని ప్రాతిపదనలు వస్తే.. తమ డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశాయి. దీంతో.. ఇరు వర్గాల మధ్య చర్చలు అనుకున్న రీతిలో ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో ఈ రోజు (శనివారం)మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

అవసరమైతే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనూ సమావేశం ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. అర్థరాత్రి ఒంటి గంట వరకు సాగిన చర్చల అనంతరం మంత్రుల కమిటీ.. ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు చెప్పిందేమిటి? చర్చల సందర్భంగా జరిగిందేమిటన్నది చూస్తే..

- ఐఆర్ రికవరీ చేయం.. పీఆర్సీని గతంలో చెప్పినట్లుగా పదేళ్లకు కాకుండా ఐదేళ్లకు ఒకసారి వేస్తామని వెల్లడించిన మంత్రుల కమిటీ

- ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్లు అయిన హెచ్ఆర్ఏ శ్లాబులు.. సీసీఏ కొనసాగింపు.. ఫిట్ మెంట్ పెంచటం.. సీపీఎస్ రద్దు లాంటి వాటిపైన మంత్రుల కమిటీ ఎలాంటి హామీ ఇవ్వలేదు.

- చర్చలు జరిగినా.. స్పష్టత మాత్రం రాలేదు. అందుకే శనివారం మరోసారి చర్చలు జరుగుతాయని మంత్రుల కమిటీ తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చెబితే.. తాము ముందే ప్రకటించినట్లుగా ఉద్యమ కార్యాచరణ సాగుతుందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

- ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) శ్లాబుల వంటి వాటిల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించటం ద్వారా ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా నివారించాలన్న నిర్ణయం

- తెలంగాణ తరహాలో హెచ్ఆర్ఏ విధానం చర్చకు రావటం.. చనిపోయిన ఉద్యోగులకు మట్టి ఖర్చుల కింద రూ.25వేలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం(?)

- మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను మరోసారి వినిపించాయి. పీఆర్సీ నివేదిక బయటపెట్టటం.. 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి. కనీసం 27 శాతానికి తగ్గకూడదు.. హెచ్ఆర్ఏ శ్లాబులు పాతవే కొనసాగాలి. సీసీఏ కొనసాగించాలి. పింఛన్ దార్లకు 70 ఏళ్లు దాటాక10 శాతం 75 ఏళ్లు దాటాక 15 శాతం అదనపు క్వాంటం వర్తింపచేయాలి.. కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం పే.. డీఏ.. హెచ్ఆర్ఏ.. ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. గ్రామ.. వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు నుంచి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలి. 2022 పీఆర్సీ స్కేల్ అమలు చేయాలని.. లాంటి పలు డిమాండ్లు ఉన్నాయి.

- ఉద్యోగ సంఘాలతో తమ చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయని.. చర్చలతో ఉద్యోగ సంఘాల అసంత్రప్తి తొలగిందని.. ఐఆర్ సర్దుబాటు చేయమని.. చెప్పామని.. ఐదేళ్లకు పీఆర్సీ వేస్తామని చెప్పినట్లుగా సజ్జల వెల్లడి.