Begin typing your search above and press return to search.

స‌మ్మె తథ్యం..చ‌ర్చ‌లు విఫ‌లం

By:  Tupaki Desk   |   6 Feb 2022 2:30 AM GMT
స‌మ్మె తథ్యం..చ‌ర్చ‌లు విఫ‌లం
X
ప్ర‌స్తుతం ఉద్యోగుల‌కు,మంత్రుల క‌మిటీకి మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో తీవ్ర ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది అని తెలుస్తోంది. చ‌ర్చ‌లు విఫ‌లం అయితే స‌మ్మె త‌థ్యం? అందాక రానిస్తారా లేదా స‌మ్మె కు ముందే ప్ర‌భుత్వం మ‌రోసారి తన నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్ష చేసుకుంటుందా? ఈ రోజు అన్ని స‌మ‌స్య‌లూ కొలిక్కి వ‌స్తాయ‌ని మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ‌, మ‌రో మంత్రి పేర్ని నాని చెప్పిన‌ప్ప‌టికీ అవేవీ వాస్త‌వ రూపం దాల్చ‌లేదు.ఫ‌లితంగా రేపు అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మె య‌థాత‌థం అయ్యే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయి.

రేప‌టి అర్ధ రాత్రి నుంచి ఉద్యోగులు స‌మ్మెకు వెళ్ల‌నున్న విష‌యం నిర్థార‌ణ‌కు నోచుకుంది. ఫిట్మెంట్ పెంపుపై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న ఇరు వ‌ర్గాల మ‌ధ్య అశాంతికి దారి తీసింది. అప‌రిష్కృత ప‌రిణామంగానే దీనిని చూస్తున్నామ‌ని మంత్రుల క‌మిటీ పేర్కొంది.దీంతో ఉద్యోగ సంఘాలు ఒక్క మెట్టు కూడా దిగేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. తాము ఈ ఒక్క విష‌య‌మై ప‌ట్టుబ‌డుతున్నామ‌ని అంటూనే ఉద్యోగ సంఘాలు స‌మ‌స్య‌ను మ‌ళ్లీ మొద‌టికి తెచ్చాయి అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.అద్దె భ‌త్యం విష‌య‌మై కూడా స‌వ‌రించిన శ్లాబులు బాగున్నా, ఫిట్మెంట్ పై మాత్రం ఉద్యోగులు త‌గ్గ‌డం లేదు.దీంతో చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. స‌మ్మె షురూ కానుంది.

ఆంధ్రావ‌ని వాకిట గ‌త కొద్దిరోజులుగా ఉద్యోగులు కొత్త పీఆర్సీ విష‌య‌మై సంబంధిత డిమాండ్ల సాధ‌న‌కు ప‌ట్టుబ‌డుతున్న సంగ‌తి విధిత‌మే! తాజాగా మంత్రుల క‌మిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. కానీ ఈ సంద‌ర్భంగా చేపట్టిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి అని తెలుస్తోంది.ముఖ్యంగా పీఆర్సీ లో ఫిట్మెంట్ పైనే ఉద్యోగులు ప‌ట్టుబ‌డుతున్నారు.23శాతం ఫిట్మెంట్ ఇవ్వ‌డాన్నిత‌ప్పు బడుతూ నిర్ణ‌యాన్ని పునః స‌మీక్ష చేసుకోవాల‌ని కోరుతున్నారు. ఇదే స‌మ‌యంలో అద్దె భ‌త్యం శ్లాబులు గ‌తంలో మాదిరిగా ఉంచాల‌ని కోరినా కూడా అది సాధ్యం కాద‌ని తేలిపోయింది. దీంతో కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌ను కొన్నింటిని మంత్రుల క‌మిటీ తెర‌పైకి తెచ్చింది.దీనిపై కూడా స‌మాలోచ‌న‌లు జ‌రిగాయ‌ని స‌మాచారం.

మ‌రోవైపు గ‌నుల శాఖ కు సంబంధించి ఇష్యూ చేసిన ఎస్మాను వెన‌క్కు తీసుకుంది ప్ర‌భుత్వం.ఇది పూర్తి అనాలోచిత చ‌ర్య అని అభివ‌ర్ణిస్తూ త‌మ‌పై ఎస్మాస్త్రం ఎలా ప్ర‌యోగిస్తార‌ని ఉద్యోగ సంఘాలు గొల్లు మంటున్న త‌రుణాన ప్ర‌భుత్వం కాస్త వెన‌క్కు త‌గ్గింది.