Begin typing your search above and press return to search.

ఏపీలో మాజీ మంత్రుల‌కు మార్కెట్ ప‌రిస్థితి అర్ధం అయిందా?

By:  Tupaki Desk   |   19 April 2022 2:30 AM GMT
ఏపీలో మాజీ మంత్రుల‌కు మార్కెట్ ప‌రిస్థితి అర్ధం అయిందా?
X
ఏపీలో మాజీ మంత్రుల ప‌రిస్థితి ఏంటి? ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు.. మాకు తిరుగులేదు.. అని అనుకున్న వారికి ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? వారిని ఎవ‌రు ప‌ట్టించుకుంటున్నారు? అప్ప‌ట్లో .. అయిన వారికి ఆకుల్లో నూ.. కానివారికి కంచాల్లోనూ.. అధికారాన్ని వ‌డ్డించిన నేత‌లకు ఇప్పుడు ప‌రిస్థితి బోధ‌ప‌డిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌గ‌న్ కేబినెట్ నుంచి 14 మంది మంత్రుల‌ను ప‌క్క‌న పెట్టారు. వీరి గ్రాఫ్ పాల‌న ప‌రంగా ఎలా ఉంద‌నేది ప‌క్క‌న పెడితే.. వారివారి నియోజ‌క‌వ‌ర్గాల్లో వారికి జైకొట్టే నాయ‌కులు.. జెండా ప‌ట్టుకునే కార్య‌క‌ర్త‌లు.. ఫ్లెక్సీలుక‌ట్టే కార్య‌క‌ర్త‌లు.. మాత్రం వెళ్లిపోయారు.

మంత్రులు మాజీ ల‌య్యాక‌.. కార్య‌క‌ర్త‌లు అంద‌రూ దూరంగా ఉన్నారు. ఇదే విష‌యాన్ని తాజాగా నెల్లూరులో జ‌రిగిన మాజీ మంత్రి అనిల్ కుమార్ స‌భ‌లో క‌నిపించింది. ఆయ‌న ఆత్మీయ‌స‌భ ఏర్పాటు చేస్తే... ప‌క్క‌నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కార్య‌క‌ర్త‌ల‌న‌ను తీసుకురావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న చెప్పుకొంటూ.. మేనేజ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, అధికారంలో ఉన్న‌ప్పుడు.. మాకు తిరుగులేద‌ని చెప్పుకొన్న మంత్రుల ప‌రిస్థితి ఇంత‌క‌న్నా దారుణంగా ఉంద‌ని అంటున్నారు.. వారిని క‌నీసం ప‌ల‌క‌రించేందుకు కూడా ఎవ‌రూ రాలేద‌ట‌!

దీనికి కార‌ణం... 2019లో త‌మ‌కు జెండా క‌ట్టి.. ఇల్లిల్లూ తిరిగి.. త‌మ గెలుపున‌కు కృషి చేసిన‌.. కార్య‌కర్త‌ల‌ను వీరు మంత్రులు అయ్యాక‌.. ప‌క్క‌న పెట్టారు. క‌నీసం వారిని ప‌ట్టించుకోలేదు. టీడీపీ నుంచి వ‌చ్చిన వారిని అక్కున చేర్చుకున్నారు. వారినే పీఏలు గా కూడా నియ‌మించుకున్నారు. అన్ని ప‌నులు వారితోనేచేయిం చుకున్నారు. ప్ర‌భుత్వం నుంచి అన్ని ప‌నులు కూడా వీరికే చేసి పెట్టారు. కొన్ని చోట్ల క‌మీష‌న్లు ఎక్కువ‌గా ఇస్తార‌ని.. టీడీపీ వారికే కాంట్రాక్టు ప‌నులు ద‌క్కేలా కొంద‌రు మంత్రులు పై స్థాయిలో చ‌క్రం తిప్పారు.

ఇలాంటి వారితో అస‌లైన కార్య‌క‌ర్త‌లు.. ప‌క్క‌కు వెళ్లిపోయారు. క‌నీసం.. మంత్రులుగా ప‌నిచేసిన వారు.. త‌మ వ‌ద్ద ప‌నిచేసే..డ్రైవ‌ర్ కుటుంబాల‌ను కానీ.. ప‌నివారి కుటుంబాల‌ను కానీ.. వంట వారి కుటుంబాల‌న‌ను కానీ.. ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వీరు విసిగిపోయి.. పార్టీపై అభిమానం ఉన్నా.. జ‌గ‌న్‌పై ప్రేమ ఉన్నా.. ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. దీంతో అధికారంలో ఉన్న‌న్నాళ్లూ.. మంత్రుల‌కు వైసీపీ నాయ‌కులుగా చ‌లామ‌ణి అయిన‌.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తోనే అన్ని ప‌నులు చేయించుకున్నారు.

కానీ.. ఇప్పుడు వీరు మాజీలు అయిపోయిన త‌ర్వాత‌.. టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. నాయ‌కులు. దూర‌మ‌య్యారు. అంటే.. ఇక‌, మాజీల‌తో త‌మ‌కు ప‌ని ఏముంద‌ని.. వారు త‌మ దారి తాముచూసుకుని మ‌రో నేత‌నువెతుక్కు నే ప‌న‌లో ప‌డ్డారు. దీంతో ఇప్పుడు మాజీల‌కు జెండా ప‌ట్టుకునేవారు.. జై కొట్టేవారు కూడా క‌రువ‌య్యారు. దీంతో మాజీ మంత్రుల ఇళ్లు, కార్యాల‌యాలు కూడా కార్య‌క‌ర్త‌లు లేక‌.. బోసిపోతున్నాయి. దీంతో వారికి ఇప్పుడు వాస్త‌వాలు తెలిసి వ‌చ్చాయి. నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌ను తాము ఎంత‌గా నిర్ల‌క్ష్యం చేశామో.. ఇప్పుడు వారికి తెలిసివ‌చ్చింద‌ట‌.

కానీ.. అప్ప‌టికే.. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. మ‌రోవైపు.. మే 1వ తేదీ నుంచి పార్టీ అధిష్టానం.. ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించాల‌ని.. ఆదేశించింది. ప్ర‌తి ఎమ్మెల్యే కూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఇప్పుడు వారి ఇంటింటి బాట ప‌ట్ట‌క‌త‌ప్ప‌దు. ఈ స‌మ‌యంలో వారి వెనుక న‌డిచేది ఎవ‌రు? నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌ను దూరం చేసుకుని.. న‌కిలీ కార్య‌క‌ర్త‌ల‌నున‌మ్ముకున్న వీరు రేపు ఎవ‌రు త‌మ వెంట న‌డుస్తార‌ని .. త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

మ‌రోవైపు.. నిజ‌మైన కార్య‌క‌ర్త‌లు.. పార్టీపై ఉన్న అభిమానంతో ప‌క్క‌కు త‌ప్పుకొన్నా.. మ‌ళ్లీ పార్టీని గెలిపించుకోవాల‌నే ఆశ‌తోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు అన్య‌యం చేసిన మంత్రుల‌కు బుద్ధి వ‌చ్చే వ‌ర‌కు ఆగి.. అప్పుడు వారితో న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు. ఈ ద‌ఫా త‌మ కు అన్ని విధాలా సాయం చేస్తామ‌నే హామీని పొందిన త‌ర్వాతే.. వారితో న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల విష‌యంలో మాజీమంత్రులు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.