Begin typing your search above and press return to search.

అర్జెంట్ గా ఏపీ ఎక్స్ పెస్ రైలు పేరు మార్చేయండి

By:  Tupaki Desk   |   24 Aug 2015 5:18 AM GMT
అర్జెంట్ గా ఏపీ ఎక్స్ పెస్ రైలు పేరు మార్చేయండి
X
ఏ ముహుర్తంలో మొదలు పెట్టారో కానీ.. ఏపీ ఎక్స్ ప్రెస్ కు సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. వారంలో అన్ని రోజులు ఏపీ ఎక్స్ ప్రెస్ ఉంటుందని ఆశించిన వారికి వారానికి మూడు రోజులే అన్న మాటతో ఉత్సాహం పోవటమే కాదు.. రికార్డు స్థాయిలో 36 గంటల ప్రయాణ సమయం.. అన్నీ ఏసీ బోగీలు ఉండటం..ధర భారీగా పెట్టటం లాంటి ఎన్నో అవలక్షాల సమాహారం ఏపీ ఎక్స్ ప్రెస్ గా మారింది.

ఈ రైలు నిర్వహణను తూర్పుకోస్తా రైల్వే నిరాకరించటంతో దేశ రాజధానిలో చేపడుతున్నారు. ఇప్పటికే ఉన్న రద్దీతో ఢిల్లీలోని రైల్వే నిర్వహక కేంద్రం కిందామీదా పడుతుంటే.. ఏపీ ఎక్స్ ప్రెస్ కారణంగా మరింత పని భారం పెరిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రైలు ప్రయాణ గంటల్ని తగ్గించే అంశంపై రైల్వే శాఖ ఇంకా నిర్ణయం తీసుకోకుండా ప్రయాణికులకు సినిమా చూపిస్తోంది.

ఏపీ ఎక్స్ ప్రెస్ ఎక్కటమే పాపం అన్నట్లుగా చేస్తున్న రైల్వే శాఖ.. తాజాగా ఈ రైలుకు సంబంధించి మరో నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు ప్రస్తుతం ఢిల్లీ వరకూ నడుపుతున్న ఈ రైలును.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కాట్రా వరకు కానీ.. లేదంటూ జమ్మూకాశ్మీర్ వరకూ కానీ పొడిగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. రైలు నిర్వహణ సమస్య తీరుతుందని చెబుతున్నారు. పేరుకు ఏపీ ఎక్స్ ప్రెస్ గా ఉండి.. ఏపీ వారికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఈ బండి పేరును అర్జెంట్ గా మార్చేస్తే బాగుండనిపించటం ఖాయం.