Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి 15 నుంచి ఏపీలో ఇంటర్నెట్‌ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

By:  Tupaki Desk   |   10 Jan 2019 1:30 AM GMT
ఫిబ్రవరి 15 నుంచి ఏపీలో ఇంటర్నెట్‌ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ
X
ఇంటర్నెట్‌ వాడకం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. చదవుకున్నవాళ్ల దగ్గరనుంచి.. నిరక్ష్యరాస్యుల వరకు ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారు. అందులో యూట్యూబ్‌ - ఫేస్‌ బుక్‌ లాంటి సోషల్‌ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఉపయోగించాలంటే ఇంటర్నెట్‌ ఉండాల్సిందే. జియో పుణ్యమా అంటూ నెట్‌ చాలా తక్కువ ధరకు వచ్చేస్తుంది. అదే ఇంటర్నెట్‌ ఇకనుంచి ఫ్రీగా వస్తే..? మీరు ఎక్కడికి వెళ్లినా.. ఇంటర్నెట్‌ మీకు ఉచితంగా లభిస్తే..? ఐడియా అదిరింది కదూ. ఆఫర్‌ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

టెక్నాలజీని తన ఇంటిపేరుగా మార్చుకున్న చంద్రబాబు.. ఫిబ్రవరి 15 నుంచి ఏపీలోని అన్ని మున్సిపాల్టీల్లో ఉచితంగా వైఫై సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే నెల 15 నుంచి ఏపీలోని 110 మున్సిపాలిటీల్లోని 970 ప్రాంతాల్లో వైఫై సేవల్ని ఉచితంగా పొందేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి గూగుల్ సంస్థతో కూడా ఒప్పందం కుదిరింది. ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా ఈ సేవలు ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఒకవేళ ఇది అమలులోకి వస్తే.. స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు నెలకు మినిమంలో మినిమం రూ.500 వరకు ఆదా అయినట్లే. అయితే… దీనికి సంబంధించిన విధి విధానాల్ని ఇంకా ఖరారు చేయలేదు. అంటే.. ఫ్రీ వైఫై ఎంత జీబీ వరకు ఇస్తారు, ఒకవేళ ఇచ్చిన పరిమితి దాటిపోతే.. అదనపు డేటా కోసం ఏమైనా చెల్లించాలా, చెల్లించాలి అంటే రేట్లు ఎలా ఉంటాయి,.. అనే విషయాల్ని త్వరలో ఏపీ ప్రభుత్వం రూపొందించబోతుంది. ఒకవేళ ఫిబ్రవరి 15 నుంచి రాష్ట్రంలో ఇది అమలైతే.. వైఫై సేవల్ని ఉచితంగా అందిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.