Begin typing your search above and press return to search.

చెత్త డబ్బులని మాయం చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   4 July 2022 7:30 AM GMT
చెత్త డబ్బులని మాయం చేస్తున్నారా?
X
యూజ‌ర్ ఛార్జీలు అంటూ చెత్త ప‌న్ను వ‌సూలు చేస్తున్నారు. త‌డి చెత్త, పొడి చెత్త సేక‌ర‌ణ నిమిత్తం ప్లాస్టిక్ డ‌బ్బాలు ఇంటింటికీ అందించి, ప్ర‌తిరోజూ వారి ద‌గ్గ నుంచి వాహ‌నాల ద్వారా చెత్త సేక‌రించి, డంపింగ్ కు త‌ర‌లిస్తున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా వాహ‌నాలు కూడా కొనుగోలు చేశారు అధికారులు.మున్సిప‌ల్, పంచాయ‌తీ ప‌రిధిలో వ‌సూలు చేసే ప‌న్ను వివ‌రం వేర్వేరుగా ఉన్నా చాలాచోట్ల స్థానికులు చెల్లించేందుకు ముందుకు రావ‌డం లేదు. కొన్ని చోట్ల నిర‌స‌న‌లూ ఉన్నాయి. ఇదే స‌మయాన ప‌న్ను క‌ట్టే వారికి క‌నీసం ర‌సీదు కూడా ఇవ్వ‌డం లేదు అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. న‌గ‌ర, పంచాయ‌తీ పాల‌క సంస్థ‌ల నుంచి ప్ర‌తి నెల ప‌దిహేను కోట్ల రూపాయ‌లు చెత్త‌ప‌న్ను రూపంలో వ‌సూలు కావాల్సి ఉంది. కానీ ఇందులో సగం డబ్బులు మాత్ర‌మే వ‌సూలు అవుతున్నాయి. ఇవి కూడా నేరుగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేర‌డం లేదు అన్న వాదనలూ ఉన్నాయి.

వలంటీర్లు ప‌న్ను వ‌సూలు చేస్తున్నారే కానీ ర‌శీదులు మాత్రం ఇవ్వ‌డం లేదు అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొన్ని చోట్ల పాయింట్ ఆఫ్ సేల్ పేరిట ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వ‌చ్చినా కూడా వాటిని సైతం వినియోగించ‌డం లేదు. క‌నిష్టంగా 30, గ‌రిష్టంగా 120 రూపాయ‌లు వ‌సూలు చేయాల్సి ఉంది. కానీ వలంటీర్లు ఒక్కొక్క‌రికీ ఒక్కో విధంగా ప‌న్ను విధిస్తూ వ‌సూలు చేస్తున్నారు. పోనీ వ‌సూల‌యిన మొత్తాల‌ను న‌గ‌ర, గ్రామ పాల‌క సంస్థ‌ల‌కు ఇస్తున్నారా అంటే అదీ లేదట.

694 పీఓఎస్ యంత్రాల‌ను స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ స‌మ‌కూర్చిన లాభం లేకుండా ఉంది. ర‌శీదు ఇస్తేనే ప‌న్ను చెల్లిస్తామ‌ని చెప్పిన వారికి వ‌లంటీర్లు చుక్క‌లు చూపిస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక సమ‌స్య‌లు ప‌రిష్కరించ‌క తాత్సారం చేస్తున్నారు అని అంటున్నారు . ర‌శీదు ఇవ్వ‌మ‌ని నిల‌దీస్తే మ‌ళ్లీ ఆ గుమ్మ‌మే ఎక్క‌డం లేద‌ని అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా ప్ర‌భుత్వంకు కనీస స్థాయిలో కూడా వ‌సూల‌వుతున్న చెత్త ప‌న్ను చేర‌డం లేదు అని చెబుతున్నారు.