Begin typing your search above and press return to search.

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..అమరావతి భూములపై సీబిఐ దర్యాప్తు!

By:  Tupaki Desk   |   11 May 2020 11:10 AM GMT
సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..అమరావతి భూములపై సీబిఐ దర్యాప్తు!
X
అమరావతి రాజధాని భూముల వ్యవహారం తాజాగా మళ్లీ తెరమీదకు వచ్చింది. అమరావతిలో రాజధాని కోసం రైతులు స్వచ్చందంగా ఇచ్చిన 33వేల ఎకరాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో అవతవకలు జరిగాయని వైసిపి ప్రభుత్వం మొదటినుండి ఆరోపిస్తుంది. అందుకు అనుగుణంగానే నిజాలను ప్రజల ముందుంచేందుకు జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. వివాదాస్పందంగా మారిన నాలుగువేల ఎకరాల భూములపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించేందుకు పావులు కదుపుతోంది.

ఇందులో జగన్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతి భూవ్యవహారాలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తునకు వైసీపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పెద్దసంఖ్యలో అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన పలువురు ప్రముఖుల నేతృత్వంలో అక్రమాలు జరిగినట్లుగా తాము గుర్తించినట్లు కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు బృందం గత కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిబంధనల ప్రకారం అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు నిషిద్ధమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దఎత్తున వాటిని దళితుల నుంచి పొందడం ద్వారా వారికి తీవ్ర నష్టం కలిగించి తాము భారీగా లబ్ధి పొందారని పేర్కొంది

భూసమీరణలో మొత్తం నూటా ఎనిమిది లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని, దళితుల నుంచి కేవలం ఐదు లక్షలతో ఎకరం కొనుగోలు చేసి ఆ తర్వాత ఫ్లాట్లు ద్వారా కోట్లు సంపాదించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ, ఐటీ శాఖకు లేఖ రాసింది. రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్న ఆర్థిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుచేసింది. 2015 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి వరకూ జరిగిన లావాదేవీల జాబితా మొత్తం సీఐడీ లేఖతో జతచేసింది. అయితే , ఈ వ్యవహారం అంతా ఇప్పుడు గందర గోళంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి సీబీఐ ఈ కేసులను విచారణకు స్వీకరిస్తుందా లేదా కాలమే నిర్ణయించాలి.