Begin typing your search above and press return to search.

క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా ?

By:  Tupaki Desk   |   28 Jan 2022 10:05 AM IST
క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా ?
X
తమ మాట వినకుండా ఆందోళనలు, నిరసనలు దాటి సమ్మె చేయబోతున్న ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చట్టప్రకారం, సుప్రీంకోర్టు ప్రకారం సమ్మె నిషిద్ధమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలను హెచ్చరించారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగులందరికీ జీతాలు పడాలంటే వాళ్ళ జీతాల బిల్లులు ప్రాసెస్ కావాలి.

కానీ ఉద్యోగులందరు నిరసనలు తెలుపుతున్న కారణంగా ఎవరి బిల్లులు ప్రాసెస్ కావటం లేదు. బిల్లులను ప్రాసెస్ చేయాల్సిన ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళుతున్న కారణంగా జీతాలు అందటంపై అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. ప్రభుత్వమేమో కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగుల నేతలేమో పాత పీఆర్సీ ప్రకారమే తమకు జీతాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఒకసారి జీతం పడిపోతే ఇన్ని రోజులు సమ్మె చేయటంలో అర్ధమే ఉండదు.

ఎందుకంటే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తగ్గుతాయని ఉద్యోగులు, పెరుగుతాయని ప్రభుత్వం ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడుతున్నారు. అందుకనే ప్రభుత్వం-ఉద్యోగుల నేతలు కొత్త-పాత పీఆర్సీల విషయంలో ఇంతగా పట్టుబడుతున్నది. అంతా బాగానే ఉంది ఉద్యోగుల నిరవధిక సమ్మె ఫిబ్రవరి 7వ తేదీ నుండి. కాబట్టి ఈలోగా జీతాల బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందే అని ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై పట్టుబడుతోంది. ఇదే సమయంలో ఎట్టి పరిస్ధితుల్లోను జీతాల బిల్లులను ప్రాసెస్ చేయవద్దంటూ ట్రెజరీ ఉద్యోగులపై ఉద్యోగుల నేతలు మరోవైపు ఒత్తిడి పెడుతున్నారు.

సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదని ప్రభుత్వం, ఉద్యోగుల నైతికతను దెబ్బ తీయద్దని ఉద్యోగ నేతలు చెరోవైపు ట్రెజరీ ఉద్యోగులను వాయించేస్తున్నారు. దాంతో ఏమి చేయాలో ట్రెజరీ ఉద్యోగులకు దిక్కు తెలీటం లేదు. ఒకవేళ బిల్లులను ప్రాసెస్ చేయకపోతే ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందనే విషయమై చర్చలు పెరిగిపోతున్నాయి. క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత ధైర్యం చేస్తుందా ? అనేదే డౌటు. ఈ పరిస్ధితుల్లో వారిపై క్రమశిక్షణా చర్యలంటే మామూలు విషయం కాదు. చివరకు ఏమవుతుందో చూడాలి.