Begin typing your search above and press return to search.

నిరుపేదల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   3 Jun 2020 6:15 AM GMT
నిరుపేదల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం !
X
ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.గత ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,38,144 ఇళ్లకు గాను రూ.1,323 కోట్లు చెల్లించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో గత ప్రభుత్వం హయాంలో గృహ నిర్మాణం బిల్లు పొందని 3,38,144 మందికి లబ్ధి చేకూరనుంది. పేదలకు ఇళ్ల నిర్మాణంపై మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని సీఎం అధికారులకు సూచించారు.

మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణంపై సమీక్షించిన సీఎం.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు లేకుండా ఇంటిని సమకూర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలని సూచించారు. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలని, ప్రభుత్వం నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలని స్పష్టం చేశారు.