Begin typing your search above and press return to search.

పదవి ఇచ్చి ఎన్టీఆర్ సతీమణిని అవమానిస్తున్నారా.?

By:  Tupaki Desk   |   12 March 2020 5:12 AM GMT
పదవి ఇచ్చి ఎన్టీఆర్ సతీమణిని అవమానిస్తున్నారా.?
X
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు సతీమణి.. అప్పట్లో ప్రభుత్వాన్ని శాసించిన మహిళ ప్రస్తుతం వైఎస్సార్సీపీలో అవమానానికి గురైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన కనుసైగలతో పాలించిన ఆమె ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాధాన్యం లేని పోస్టులో కొనసాగుతున్నారు. ఆ పోస్టు ఇచ్చినప్పటికీ జీతభత్యాలు కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర అవమానానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పోస్టు పెద్దదే అయినా విభజన వలన ఏర్పడిన సమస్యతో ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం పేర్కొనట్టు పదవి ఉన్నా.. దాని విభజన జరగకపోవడంతో ప్రస్తుతం గుప్పటిప్పతొలి ఆమె గందరగోళంలో పడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు.

రచయిత, సాహితీ ప్రియురాలు కావడం తో నందమూరి లక్ష్మీపార్వతికి మూడు నెలల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. కేబినెట్ హోదా కల్పించారు. బాధ్యతలు చేపట్టడానికి, కార్యాలయం నిర్వహణ, పరిపాలన చేద్దామంటే సంబంధిత శాఖ నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆమెకు జీతభత్యం అందడం లేదు. మూడు నెలలుగా అధికారులు ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. అసలు రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ అనే పదవే లేదంటూ చెబుతున్నారు. దీంతో ఆమె తన ప్రయత్నాలు తాను చేసింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు సీఎం జగన్ కు సమస్య వివరించారు.

వాస్తవంగా పరిశీలిస్తే తెలుగు అకాడమీ ఇంకా విభజన పూర్తి కాలేదు. విభజన చట్టం షెడ్యూల్ 10లో ఈ అకాడమీ ఉంది. ఇంకా విభజన పూర్తి కాలేదు. దీంతో రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ పదవి అనేది కనిపించడం లేదని అధికారులు చెబుతున్న వాదన. దీంతో ఆ పోస్టు తాము ఎలా చెల్లిస్తామని సంబంధిత శాఖ చెబుతోంది. ఇదే విషయమై సాధారణ పరిపాలన శాఖ తమకు పంపిన ఫైల్ ను విద్యా శాఖ తిరిగి పంపింది. తమ శాఖ పరిధిలోనే కాదు.. రాష్ట్రంలో లేని ఛైర్ పర్సన్ కు వేతనం ఇవ్వలేమని ఉన్నత విద్యా శాఖ తెగేసి చెప్పింది. దీంతో లక్ష్మీపార్వతి అవమానానికి గురయ్యారు. లేని హోదా తనకు కల్పించారా అని ఆమె మనస్తాపానికి గురయ్యారు.

దీన్ని గుర్తించిన ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు చేపట్టింది. సాధారణ పరిపాలన శాఖ తన బడ్జెట్ నుంచి లక్ష్మీ పార్వతికి జీతభత్యాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ అవడంతో కొంత ఈ వివాదం సద్దుమణిగింది. తెలుగు అకాడమీ విభజన పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి సొసైటీస్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసేలా ప్రభుత్వం యోచిస్తోంది. విభజన వరకు సాధారణ పరిపాలన శాఖ జీతభత్యాలు చెల్లించనుంది.