Begin typing your search above and press return to search.

ఏసీబీ డీజీ బదిలీ, ఆ ప్లేసులోకి తిరుగులేని సీతయ్య

By:  Tupaki Desk   |   4 Jan 2020 3:52 PM GMT
ఏసీబీ డీజీ బదిలీ, ఆ ప్లేసులోకి తిరుగులేని సీతయ్య
X
ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్న ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కుమార విశ్వజిత్‌ పై బదిలీ వేటు వేసి మరో కీలకాధికారిని ఆ స్థానంలోకి తీసుకొచ్చారు. నిజానికి రెండు రోజుల కిందటే ఏసీబీ పనితీరు పై జగన్ సమీక్ష జరిపారు. ఆ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆగ్రహిస్తూనే మెరుగుపడాలంటూ కొంత సమయం ఇచ్చారు. కానీ ఏకంగా డీజీ స్థాయి అధికారిని మార్చేశారు.

ఏపీలో అవినీతి రహితంగా పాలన అందిస్తానంటూ చెబుతున్న జగన్ ఆ మేరకు ఏసీబీ నుంచి ఎంతో ఆశిస్తున్నారు. అయితే, తన అంచనాలకు తగ్గట్లుగా ఏసీబీ పనిచేయడం లేదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ఆ క్రమంలోనే ఏసీబీ డీజీని మార్చి రాష్ట్రంలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఆయన స్థానంలో పీఎస్సార్ ఆంజనేయులును తీసుకొచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

సీనియర్ అధికారి ఆంజనేయులు ప్రస్తుతం రవాణా శాఖ కమీషనర్‌ గా ఉన్నారు. ఆయన్ను విశ్వజిత్ స్థానంలో ఏసీబీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్విజిత్‌ ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని సూచించారు.

రెండు రోజుల క్రితం ఏసీబీ పైన సీఎం సమీక్షించారు. తన లక్ష్యాలకు అనుగుణంగా ఏసీబీ పని చేయటం లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. సిబ్బందిలో మరింత సీరియస్ నెస్ పెంచేందుకు ఏకంగా ఏసీబీ డీజీ పైనే బదిలీ వేటు వేశారు.

పీఎస్సార్ ఆంజనేయులు ట్రాన్స్‌ పోర్ట్ కమిషనర్‌ గా తన సత్తా చాటారు. అవినీతి లేకుండా చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ దందాని కట్టడి చేశారు. ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడి నుంచి కూడా రివకరీ చేయగలిగారు. జేసీ దివాకరరెడ్డి వంటి నాయకుడికి ఎదురెళ్లి నిలిచారు. దీంతో ఆయన పనితీరు నచ్చి జగన్ ఏకంగా ఆయనకు ఏసీబీ డీజీగా నియమించారు. అవినీతి రహిత పాలన అందించే లక్ష్యంతో గద్దెనెక్కిన జగన్ తన లక్ష్య సాధనకు పీఎస్సార్ ఆంజనేయులు ఉపయోగపడతారనే తీసుకొచ్చారు. ఏపీలోని అవినీతి అధికారుల భరతం పట్టమన్నారు. రవాణా శాఖ కమిషనర్‌ గానూ పీఎస్సాఆర్ ఆంజనేయులు కొనసాగుతారు. మరోవైపు ఏపీపీఎస్సీ కార్యదర్శి గానూ ఆయన కొనసాగుతారు. మొత్తానికి సీతయ్య ఇక అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతారేమో?