Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ తరగతులను నిషేధించిన ఏపీ ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   8 July 2020 6:30 AM GMT
ఆన్ లైన్ తరగతులను నిషేధించిన ఏపీ ప్రభుత్వం!
X
విద్యా వ్యాపారమైంది. కోట్ల రూపాయల విలువైపోయింది. అందుకే ప్రపంచాన్ని వణికిస్తూ కరోనా ప్రబలుతున్నా ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ మాత్రం ఆగడం లేదు. ప్రజలకు రూపాయి సంపాదన లేక బతుకుజీవుడా అని అందరూ ఇంట్లోనే ఉంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఆన్ లైన్ క్లాసుల పేరిట అడ్డంగా దోచుకుంటున్నాయి. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను కొనాలని.. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లు చెబుతూ వేల ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఈ విద్యా దోపిడీపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

ప్రైవేటు విద్యాసంస్థలు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు విద్యాసంవత్సరం 2020 ఆగస్టు 3న ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2020-21 విద్యా సంవత్సర షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసే వరకు ఆన్‌లైన్ తరగతులకు వెళ్లవద్దని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలను కోరారు.

ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులు హాజరుకావడానికి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, టాబ్లెట్లు కొనలేమని కొంతమంది తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఈ హెచ్చరిక జారీ చేశారు. మహమ్మారి నేపథ్యంలో, లక్షలాది మంది ప్రజలు చేతిలో చిల్లీగవ్వ లేక బతకడానికే అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు స్మార్ట్ ఫోన్‌లను ఎలా కొనుగోలు చేయగలరు అని సురేష్ అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేని విద్యార్థులు వెనుకబడి ఉంటారని, వాటిని కలిగి ఉన్నవారు ఆన్‌లైన్ తరగతులను వింటారని మంత్రి చెప్పారు. జ్ఞానం పొందడంలో ఉన్న అసమానత దృష్ట్యా, ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులపై నిషేధాన్ని జారీ చేసిందని ఆయన అన్నారు.

కరోనావైరస్ - లాక్డౌన్ దృష్ట్యా చాలా ప్రైవేట్ పాఠశాలలు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని మంత్రి చెప్పారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండీ వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆన్‌లైన్ తరగతులను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పరిశీలిస్తుందని వివరించారు.

ఇదిలావుండగా.. డిగ్రీ, పిజి పరీక్షలను నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందాయని వాటిని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.