Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రైవేట్‌ కరోనా‌ కేర్‌ సెంటర్ల పై ప్రభుత్వం కొరడా !

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:30 PM GMT
ఏపీలో ప్రైవేట్‌ కరోనా‌ కేర్‌ సెంటర్ల పై  ప్రభుత్వం కొరడా !
X
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కరోనా‌ కేర్‌ సెంటర్ల పై అధికారులు ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణ చేపించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో విజయవాడలోని ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతిని రద్దు చేస్తూ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడలోని 5 ప్రైవేట్ కరోనా కేర్ సెంటర్ల అనుమతులను ఆరోగ్య విభాగం అధికారులు బుధవారం రద్దు చేశారు. నిబంధనల ఉల్లంఘన, అధిక ఫీజులు వసూలు చేసిన రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్ అనుమతులను అధికారులు రద్దు చేశారు. దీంతోపాటు ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్‌ కు చెందిన ఐరా హోటల్, ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన హోటల్ మర్గ్ కృష్ణయ్య, హోటల్ సన్‌ సిటీ అనుమతులను అధికారులు రద్దు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నవారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

విజయవాడ సిటీ లోని కరోనా బాధితుల నుండి అందిన ఫిర్యాదుల మేరకే ఈ ఐదు కరోనా కేర్‌ సెంటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది . అయితే తాజాగా స్వర్ణప్యాలెస్‌ ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు.. తనిఖీలు చేసి అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు ఈ కేసులో నిందితులుగా చేర్చలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. తాజాగా బుధవారం ఉదయం అనంతపూర్ ‌లోని సర్వజన ఆస్పత్రిలో మంటలు అంటుకున్నాయి. మంటల్లో పలు రికార్డులు, ఫర్నిచర్ కాలిపోయింది. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.