Begin typing your search above and press return to search.

బాబు.. ఈనాడు.. ఆంధ్రజ్యోతిలపై పరువునష్టం కేసు ఎందుకు?

By:  Tupaki Desk   |   21 Jun 2020 5:30 AM GMT
బాబు.. ఈనాడు.. ఆంధ్రజ్యోతిలపై పరువునష్టం కేసు ఎందుకు?
X
తప్పుడు కథనాల్ని ప్రచురించి.. ప్రభుత్వ ప్రతిష్ఠను మంట కలుపుతున్నారంటూ విపక్ష నేత చంద్రబాబు.. ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు.. ఆంధ్రజ్యోతిలపై పరువు నష్టం కేసును నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు కూడా. దీనికి సంబంధించిన లీగల్ నోటీసుల్ని తాజాగా జారీ చేసినట్లు మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు.

ఇంతకీ ఈ వివాదం ఏమిటి? మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసే వరకూ గనుల శాఖ సిద్ధమైందన్న విషయంలోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సున్నపురాయి మైనింగ్ లీజును కేంద్రం చట్టం ప్రకారమే యాభై ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూటికి నూరు శాతం నిబంధనల ప్రకారమే జీవో ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కథనాల్ని ఈనాడు.. ఆంధ్రజ్యోతి ప్రచురించినట్లుగా పేర్కొన్నారు.

దురుద్దేశంతోనే తప్పుడు కథనాలు ప్రచురించినట్లుగా పేర్కొన్న గనుల శాఖ.. పదిహేను రోజుల్లో తమకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేనిపక్షంలో చట్టపరంగా ప్రభుత్వం సివిల్.. క్రిమినల్ చర్యల్ని తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా విపక్ష నేత చంద్రబాబుతో పాటు.. ఈ రెండు మీడియా సంస్థలకు తాము లీగల్ నోటీసులు పంపినట్లుగా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. మరో కథనం విషయంలోనూ ఈనాడుకు ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు పంపింది. బియ్యం పంపిణీ కోసం వినియోగించే సంచులను సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థ నుంచి ప్రభుత్వం టెండర్లు వేయకుండానే కొనుగోలు చేసిందన్న ఆరోపణలు చేసిన చంద్రబాబుకు.. ఆ వార్తను ప్రచురించిన ఈనాడుకు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావుకు.. ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు రాష్ట్ర సర్కారు లీగలు నోటీసులు పంపటం గమనార్హం.

తమ నోటీసులు అందిన ఏడు రోజుల వ్యవధిలో క్షమాపణలు చెప్పాలని.. లేకుండా పరువు నష్టం కింద పరిగణించి కేసు వేయనున్నట్లు హెచ్చరించింది. ఇలా వరుస వార్తలపై ప్రభుత్వంలోని వివిధ విభాగాలు వేస్తున్న కేసులు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్ని తీసుకు వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.