Begin typing your search above and press return to search.

కంపెనీలకు ఆధార్ నంబర్..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   14 Aug 2020 7:15 AM GMT
కంపెనీలకు ఆధార్ నంబర్..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
X
కరోనా మహమ్మారి లాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో పరిశ్రమల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతీ పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్ కేటాయించేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్దం చేస్తోంది. పరిశ్రమ ఆధార్ పేరిట ప్రత్యేక సంఖ్య కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట సర్వే చేపట్టన్నున్నారు.

ఏపీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న కార్మికులు - విద్యుత్ - భూమి - నీరు ఇతర వనరులు - ఎగుమతి - దిగుమతులు - ముడి సరకుల లభ్యత - మార్కెటింగ్ తదితర అంశాలను కూడా తెలుసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే చేయనుంది. ఈ సర్వే ను గ్రామ, వార్డు సచివాలయల ద్వారా ప్రభుత్వం చేయబోతుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. సమగ్ర పరిశ్రమ సర్వే కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో మరో కమిటీ వేయనున్నారు. అక్టోబర్‌ 15కల్లా సర్వే పూర్తి చేసి అదే నెల 30వ తేదీలోగా పూర్తి సమాచారాన్ని విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచారు.