Begin typing your search above and press return to search.

‘కీ’పాయింట్: తాజా ‘రద్దు’ బిల్లులో ఏముంది? బుగ్గన ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   23 Nov 2021 4:06 AM GMT
‘కీ’పాయింట్: తాజా ‘రద్దు’ బిల్లులో ఏముంది? బుగ్గన ఏం చెప్పారు?
X
సంచలనంగా మారిన ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగానే కాదు.. అంతకుమించిన ఆశ్చర్యాన్ని మిగిల్చింది. ఒకటి కాదు మూడు అంటూ మొండిపట్టుదలను ప్రదర్శించటమే కాదు.. తమ ఆచరణకు సంబంధించిన బలమైన వాదనను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే.

2019 ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చినా అమరావతినే రాజధానిగా ఉంటుందని.. దాన్ని కొనసాగిస్తామని చెప్పిన వైసీపీ అధినేత.. తాను పవర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అందుకు భిన్నంగా ఒకటి కాదు మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ కు అని చెబుతూ తీసుకున్న నిర్ణయం.. దానికి అనుగుణంగా తీసుకొచ్చిన బిల్లులతో రగిలిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇప్పుడు అందుకు భిన్నంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంతో పాటు.. 2014లో ఆమోదించిన సీఆర్ డీఏ చట్టం మళ్లీ అమల్లోకి రానున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఏఎంఆర్ డీఏ)కి సంబంధించిన అన్ని రకాల ఆస్తులు..అప్పుటు సీఆర్డీఏకు బదిలీ కానున్నాయి. ఈ కొత్తబిల్లు చట్టంగా మారి.. అమల్లోకి వచ్చినంతనే సీఆర్డీఏ ఉద్యోగులుగా మారిపోనున్నారు.

ఇదే విషయాన్ని ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. కొత్త బిల్లుతో అందరు స్టేక్ హోల్డర్స్ తోనూ సంప్రదింపులు జరపటం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల్ని పరిగణలోకి తీసుకొని.. చట్ట నిబందనల్ని మరింత మెరుగుపరుస్తూ వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెట్టేందుకు వీలుగా.. ఇంతకు ముందున్న రెండు చట్టాల్ని ప్రభుత్వం రద్దు చేస్తోందన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా డెవలప్ చేసేందుకు.. శ్రీభాగ్ ఒప్పందంలోని హామీల్ని నెరవేర్చేందుకు.. ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాల డెవలప్ మెంట్ కు.. ప్రాంతీయ ఉద్యమాల్ని ద్రష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అప్పట్లో మూడు రాజధానులు.. సీఆర్డీఏ రద్దు చట్టాన్ని తెచ్చిందంటూ వాదనను అత్యంత ప్రయాసతో వినిపించే ప్రయత్నం చేశారు.

తాము తీసుకొచ్చిన చట్టాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని.. కోర్టుల్లోకేసులు నమోదైన విషయాన్ని బుగ్గన పేర్కొన్నారు. దీంతో.. మరింత సమగ్రంగా బిల్లును ప్రవేశ పెట్టేందుకు.. ఆ చట్టాల్నిరద్దు చేస్తున్నట్లుగా చెప్పారు. మొత్తానికి తాజాగా ప్రవేశ పెట్టే బిల్లులోని అంశాలు తక్కువగా.. తాము తీసుకున్న రద్దు నిర్ణయాన్ని సమర్థించేందుకు బుగ్గన భారీగానే ప్రయాసకు గురయ్యారని చెప్పక తప్పదు.