Begin typing your search above and press return to search.

ఎన్నికల కమీషన్ పై రివర్స్ కేసు... ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:15 AM GMT
ఎన్నికల కమీషన్ పై రివర్స్ కేసు... ఏం జరగనుంది?
X
ప్రభుత్వం రివర్సు గేరు వేసింది. ఇంతకాలం వివిధ అంశాలపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అలాంటిది తాజగా ప్రభుత్వమే ఎలక్షన్ కమీషన్ పై కోర్టులో కేసు వేసింది. బహుశా ముందు జాగ్రత్తగానో లేకపోతే వ్యూహాత్మకంగానో ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది. ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ మొదలుపెట్టిన ప్రక్రియను నిలిపేయాలని ఆదేశించాలని కోరుతు ప్రభుత్వం తన పిటీషన్లో పేర్కొన్నది.

మొన్నటి మార్చిలో జరుగుతున్న స్దానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే. లేని కరోనా వైరస్ ను బూచిగా చూపించి నిమ్మగడ్డ ప్రభుత్వంతో కనీసం మాట మాత్రంగా కూడా మాట్లాడకుండానే ఎన్నికలను వాయిదా వేయటం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి నుండి ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య అనేక వివాదాలు జరుగుతునే ఉన్నాయి. చివరకు ఈ వివాదాలు ఏ స్ధాయిచి చేరుకున్నాయంటే ప్రభుత్వం-ఎన్నికల కమీషనర్ అన్నట్లు కాకుండా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా మారిపోయింది.

ఈ నేపధ్యంలోనే వచ్చే ఏప్రిల్లో రిటైరయ్యేలోగా ఎలాగైనా వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించేయాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నారు. ఇదే సందర్భంలో నిమ్మగడ్డ సీటులో ఉన్నంత వరకు ఎన్నికలను నిర్వహించేందుకు లేదని ప్రభుత్వం కూడా గట్టి పట్టుదలతో ఉంది. ఇదిలా ఉండగానే ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ డిసైడ్ అయ్యారు. రాజకీయపార్టీలతో సమావేశం పెట్టిన తర్వాత ఇదే విషయాన్ని చీఫ్ సెక్రటరి నీలం సాహ్నికి లేఖ రాశారు.

అయితే కరోనా వైరస్ సమస్య కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్దితులు లేవని నీలం బదులిచ్చారు. దీంతో మళ్ళీ లేఖల యుద్ధం జరుగుతోంది. వీళ్ళ మధ్య లేఖల యుద్దం జరుగుతుండగానే ప్రభుత్వం తరపున పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా స్ధానిక సంస్ధలను నిర్వహించే పరిస్ధితులు లేవంటు చెప్పింది. ప్రస్తుత కేసులు, ఇప్పటివరకు నమోదైన మరణాలు, ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు తదితరాలను తన పిటీషన్ లో స్పష్టగా చెప్పింది.

కాబట్టి ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలని ఆదేశించాలని తన పిటీషన్లో ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. మరి ప్రభుత్వం దాఖలు చేసిన తాజా కేసుపై కోర్టు ఏ విదంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇంతకాలం నిమ్మగడ్డే ప్రభుత్వంపై కేసులు వేస్తున్నారు. మొదటిసారి ప్రభుత్వమే నిమ్మ గడ్డపై ఎదురు కేసు పెట్టింది. చూద్దాం ఏమి జరుగుతుందో.