Begin typing your search above and press return to search.

తెలంగాణ స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   9 March 2020 6:11 AM GMT
తెలంగాణ స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X
చట్టంలో ఉన్న లొసుగులతో ఎన్నో అక్రమాలు, అవినీతి జరుగుతుంటుంది. వాటిని ఆసరాగా చేసుకుని పనులు తప్పించుకుని కాలం వెళ్లదీసే వ్యవస్థ ప్రస్తుతం పంచాయతీల్లో ఉంది. నియమనిబంధనలు పాటించకుండా కాలం వెళ్లదీస్తున్న సర్పంచ్ లకు గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి. పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే తెలంగాణ లో అమలు చేసిన విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు సమాచారం. సర్పంచ్ ల అధికారాలు, విధుల విషయం లో తెలంగాణ లో అనుసరిస్తున్న వైఖరినే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.

పంచాయతీ రాజ్ చట్టం లో నియమ నిబంధనలు పాటించక పోయినా, అవినీతికి పాల్పడినా సర్పంచ్ లకు ఇక వారు పదవులు కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మేరకు పంచాయతీ చట్టం కఠినంగా రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏపీ పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేసింది. ఆ చట్టాన్ని మరింత కఠినం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచినట్లు గుర్తిస్తే అనర్హత వేటు వేయడంతో పాటు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేందుకు పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చింది.

ఈ మేరకు ఆ చట్టంలో ఈ నిబంధనలు వివరించారు. గ్రామసభలు నిర్వహించకపోతే, ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోయినా బాధ్యులైన సర్పంచ్, ఉప సర్పంచ్ లను తొలగించేలా నిబంధనలు తెచ్చారు. ఇప్పటివరకు కీలక విషయాల్లో గ్రామసభలు నిర్వహించకుండానే సర్పంచ్ లు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించి ఈ మేరకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సర్పంచ్ ల తొలగింపులో సర్వాధికారాలు జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టారు. వీటితో పాటు పంచాయతీ లో నివాసం, రోజూ పంచాయతీ కార్యాలయానికి రావడం తదితర పంచాయతీ రాజ్ చట్టం లో పొందుపర్చారు. అవేవి చేయకుంటే తమ పదవికి గండం ఏర్పడే అవకాశం వచ్చింది.

ఈ చట్టం ప్రకారం..
- ప్రతీ సర్పంచ్, ఉప సర్పంచ్ పంచాయతీ లో నివాసం ఉండాలి.
- రోజూ పంచాయతీ కార్యాలయానికి రావాల్సిందే.
- తనకిచ్చిన అధికారాలు దుర్వినియోగం చేసినా, దుష్ప్రవర్తనకు పాల్పడినా, నిధులు సొంతంగా వాడుకున్నా, కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులు అమలు చేయకపోయినా పదవి నుంచి తొలగించే అధికారం కలెక్టర్ కు అప్పగింత.
- తప్పిదాలపై వివరణ ఇచ్చే అవకాశం కల్పించి ఉద్వాసన పలికేందుకు కలెక్టర్లకు అధికారం.
- తొలగింపుపై 30 రోజుల్లో అప్పీలు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల నుంచి ఉద్వాసనకు గురైన వారు ప్రభుత్వానికి అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారిపై తుది నిర్ణయం తీసుకునే వరకూ ప్రభుత్వం స్టే ఇచ్చే అధికారం ఉంది.
- స్టే సమయంలో అవిశ్వాసం మినహా మిగతా అన్ని పంచాయతీ సమావేశాలకు వీరు హాజరుకావచ్చు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఆరునెలల పాటు తాత్కాలికంగా కూడా సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారు.
- ఏడాది వ్యవధిలో దీన్ని పొడిగించే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుంది.