Begin typing your search above and press return to search.

సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త!

By:  Tupaki Desk   |   3 Jun 2022 9:33 AM GMT
సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త!
X
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని డిపార్టమెంటల్ టెస్టుల్లో ఉత్తీర్ణులైనవారికి ప్రొబేషన్ ఖరారు చేయనుంది. ఈ మేరకు జూన్ 10న ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రొబేషన్ ఖరారు అయినవారికి జూలై 1 నుంచి నూతన పేస్కేల్ ప్రకారం వేతనాలు అందించనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.17 లక్షల మంది ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా మొత్తం 1.17 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో వివిధ నిబంధనలను చూపి 56 వేల మందికి మాత్రమే ప్రొబేషన్ ఖరారు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. పలు కారణాలు చూపి 60 వేల మంది ఉద్యోగులను పక్కన పెట్టినట్టు సమాచారం. దీంతో వీరంతా తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. తాము ప్రభుత్వ నియామక పరీక్ష రాసి ఉద్యోగం సాధించినా.. ప్రొబేషన్ పేరుతో రూ.15 వేల తక్కువ జీతానికే తమతో పనిచేయించుకున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

గతంలో పీఆర్సీ, వేతనాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు నిరసనకు దిగినప్పుడు వారితోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు వీరికి కూడా భరోసా ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని వారికి జూన్ లో ప్రొబేషన్ ఇస్తామని చెప్పింది. అయితే డిపార్టమెంట్ టెస్టులో పాసయితేనే అని మెలికపెట్టింది. డిపార్టుమెంట్ టెస్టు కూడా కొద్దిమందికే నిర్వహించింది. వాటి ఫలితాలను ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమందికి ఇప్పటివరకు డిపార్టుమెంట్ టెస్టు నిర్వహించలేదు. 14 వేల మంది మహిళా పోలీసులకు ఏడాది క్రితం డిపార్టుమెంట్ టెస్టు నిర్వహించినా ఇంతవరకు ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వారందరికీ పర్మినెంటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ విషయం మీద తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి కూడా స్పందించారు. 14 వేల మంది మహిళా పోలీసుల డిపార్టుమెంట్ టెస్టుల ఫలితాలు త్వరలో విడుదలవుతాయన్నారు. డిపార్టుమెంటల్ టెస్టులు నిర్వహించనవారికి ఈ నెలాఖరులోగా నిర్వహిస్తారని తెలిపారు. ప్రొబేషన్ ప్రకటించిన వెంటనే ఆయా పోస్టుల కేటగిరీ ప్రకారం విధులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇస్తుందన్నారు. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా సంబంధిత లైన్ డిపార్టుమెంట్లతో గ్రామ సచివాలయ ప్రొబేషన్ ప్రకటిస్తుందని వివరించారు.

కాగా 15 రోజుల కంటే ఎక్కువ క్యాజువల్ లీవులు వాడుకున్న కార్యదర్శులకు, షోకాజు నోటీసులు అందుకున్నవారికి, మెటర్నటీ లీవులో ఉన్న సిబ్బందికి, అనారోగ్యంతో సెలవులో ఉన్నవారికి ప్రొబేషన్ ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే కొంతమంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం పెట్టిన టార్గెట్లు పూర్తి చేయలేదని వారికి కూడా ప్రొబేషన్ ఇవ్వడం లేదని అంటున్నారు.

అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఎల్లో మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతోంది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం ఎల్లో మీడియాపై మండిపడింది. జూన్ నెలాఖరుకల్లా ప్రొబేషన్ ఖరారు చేసి జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనవరిలోనే ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొంటున్నారు. డిపార్టుమెంటల్ పరీక్షలు పాసయిన 80 వేల మంది ఉద్యోగుల వివరాలను అధికారులు తెప్పించుకుంటున్నారని వివరిస్తున్నారు. త్వరలోనే మరో 14 వేల మహిళా పోలీసుల డిపార్టుమెంటల్ టెస్టు ఫలితాలను వెల్లడిస్తామని చెబుతున్నారు.