Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్రియమైన ఆఫీసర్ సస్పెన్షన్

By:  Tupaki Desk   |   9 Feb 2020 4:26 AM GMT
చంద్రబాబు ప్రియమైన ఆఫీసర్ సస్పెన్షన్
X
సంచలన నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడని ఏపీలోని జగన్ సర్కారు తాజాగా అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి.. మాజీ ఇంటెలిజన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వును జారీ చేసింది. శనివారం పొద్దుపోయిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం.. ఆలస్యంగా బయటకు వచ్చింది.

సర్వీసు నిబంధనల్ని బ్రేక్ చేశారన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఈ కారణంతోనే సంచలన వేటు వేసినట్లు చెబుతున్నారు. 1989 ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి.. ఏడీజీపీగా పని చేసినప్పుడు ఆయన నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న నివేదిక ఆయన మీద వచ్చింది.

డీజీపీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం.. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. డీజీపీ నివేదిక ఆధారంగా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం పేర్కొంది. సస్పెన్షన్ లో ఉన్న కాలంలో ఆయన బెజవాడను దాటి బయటకు వెళ్లే వీల్లేదు. అలా చేయాలంటే ఆయన ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏ బి వెంకటేశ్వరరావు ఇంటెలిజన్స్ చీఫ్ గా వ్యవహరించారు. ఎన్నికల వేళలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు కారణంగానే ఎన్నికల ముందు ఆయన్ను నిఘా చీఫ్ గా పదవి నుంచి బదిలీ చేసింది ఎన్నికల సంఘం. తాజాగా తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.