Begin typing your search above and press return to search.

తిరుమలలో డైలీ 400 మందికి వైరస్ పరీక్షలు !

By:  Tupaki Desk   |   13 Jun 2020 10:30 AM GMT
తిరుమలలో డైలీ 400 మందికి వైరస్ పరీక్షలు !
X
ఏపీలో రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన తరువాత కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇదే సమయంలో అన్ లాక్ 1 అంటూ ఆలయాలలో దర్శనాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో ఏపీలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించారు. గురువారం నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తోన్న సంగతి తెలిసిందే. అంతకుముందు మూడురోజులు ఉద్యోగులు, సిబ్బంది, కుటుంబసభ్యులతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.

ఇకపోతే ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులు, ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజు 400 మందికి టెస్టులు నిర్వహిస్తామని.. ఇందులో 200 మంది భక్తులు ఉంటారని.. మిగతావారు సిబ్బంది అని తెలిపింది. ఇటీవల జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో.. తిరుమలకు వచ్చే భక్తులకు పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా టెస్టులు చేస్తే మంచిదని చెప్పడంతో ఆ దిశగా టీటీడీ ముందుకెళ్తుంది.

తిరుమలకు వచ్చే భక్తులకు అలిపిరి వద్ద థర్మల్ స్కాన్ చేస్తున్నారు. అలాగే 100 మంది భక్తుల నుంచి ఇక్కడే రక్త నమూనాలను సేకరిస్తారు. మిగతా 100 నుంచి తిరుమల కొండపై సేకరిస్తామని తెలిపారు. శాంపిల్స్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్స్ ‌కు పంపిస్తామని.. ఫలితాలు కనీసం 6 నుంచి 8 గంటల్లోపు వస్తాయని తెలిపారు. వేగంగా ఫలితం రావడంతో.. ఒకవేళ భక్తుడికి పాజిటివ్ సోకిందని తెలితే.. వెంటనే తిరుపతి వైరస్ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న తమిళనాడు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వైరస్ వల్ల ఇప్పుడు రోజుకు టీటీడీ 6 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తోంది. అంతకుముందు రోజుకు స్వామివారిని 60 వేల మంది దర్శించుకునేవారు.