Begin typing your search above and press return to search.

ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ : ప్రచార ఆర్భాటం..ప్రాణ సంకటం

By:  Tupaki Desk   |   26 July 2022 4:30 PM GMT
ఇంటికి ఫ్యామిలీ డాక్టర్  : ప్రచార ఆర్భాటం..ప్రాణ సంకటం
X
జబ్బు కుదరాలీ అంటే డాక్టర్ ఒకరు ఉండాలి. అది కూడా అందుబాటులో ఉండాలి. అంతే తప్ప ఏదో టైమ్ లో తమ ఇంటికి వచ్చి పోయే ఫ్యామిలీ డాక్టర్ కాదు, అసలు ఈ కాన్సెప్ట్ తప్పు. కానీ వైసీపీ సర్కార్ ఆగస్ట్ 15 నుంచి ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్ అని ఒక కొత్త పధకానికి శ్రీకారం చుడుతోంది. ఇది నిజంగా క్లిక్ అవుతుందా అంటే జబ్బు పెరుగుతుంది తప్ప ఒరిగేది లేదు, జరిగేది లేదు అని జనాలు అపుడే పెదవి విరుస్తున్నారు.

వైద్య రంగంలో సంస్కరణలు పేరిట వైసీపీ సర్కార్ చేస్తున్న విన్యాసాలు అన్నీ కూడా చివరికి వికటించేలాగానే ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఈ రోజుకీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ల కొరత ఉంది. మందుల కొరత ఉంది. అలాగే ఆసుపత్రులు లేని పల్లెలు కో కొల్లలు. అలాంటి పరిస్థితులలో ఏపీ సర్కార్ ఫ్యామిలీ డాక్టర్ అని ఒక కొత్త స్కీమ్ ని తీసుకువస్తే ప్రయోజనం ఏమిటి అన్నదే జనాల నుంచి వస్తున్న సూటి ప్రశ్న.

ఈ రోజుల్లో విద్య వైద్యం అన్నవి సామాన్యుడికి ఏ మాత్రం అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఏదైనా రోగం వచ్చి ఆసుపత్రికి వెళ్తే జబ్బు తగ్గుతుందో ఏమో తెలియదు కానీ ఇల్లూ ఒళ్ళూ చిల్లు పడిపోతోంది. దాంతో జీవిత కాలం సరిపడా అప్పులు తెచ్చుకుంటున్నాడు. ఈ విషయం తెలిసే నాడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకాన్ని తీసుకువచ్చారు. అయితే దాని వల్ల ఎంతో కొంత ఉపశమనం కలిగినా పూర్తి స్థాయిలో ఏమీ జరగలేదు అన్నది ఈ రోజుకీ సాదర జనాలలో ఉన్న మాట.

ఇపుడు వైసీపీ సర్కార్ ఆ విధంగా కాకుండా ఇంటింటికీ ఒక ఫ్యామిలీ డాక్టర్ ని పంపించి వారికి అన్నీ ఇంటి దగ్గరే చూడాలని అనుకుంటోంది. ఇది ఆలోచనగా చూస్తే మంచిచే. అన్నీ ఇంటి వద్దకే చేర్చి జనాలను గుమ్మం కదలనీయకుండా చేయాలనుకోవడం కూడా ఉత్తమమైన ఆలోచనే. అయితే అయ్య వచ్చే వరకూ అమావాస్య ఆగదు అన్నట్లుగా రోగికి పీకల మీదకు వస్తే ముందు ఆసుపత్రికి పరిగెడతాడు తప్ప ఫోన్ చేసి సర్కార్ వారి ఫ్యామిలీ డాక్టర్ కోసం ఎదురుచూడడు కదా.

అంటే ప్రభుత్వం తెస్తున్న ఈ కొత్త స్కీమ్ ఆచరణలో ఎలా తేలిపోతోందో ముందే అర్ధమవుతోంది కదా. దానికి బదులుగా ప్రతీ ఊళ్ళో ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ వైద్యులను నియమించి అన్ని రకాలుగా వైద్యం అందుబాటులో ఉండేలా చూస్తే బాగుంటుంది అని వైసీపీ సర్కార్ కి సూచనలు వస్తున్నాయి.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇదే వైసీపీ సర్కార్ ఇంటింటికీ రేషన్ అంటూ ఆరు వందల కోట్ల రూపాయలను వెచ్చించి వాహనాలను కొని ఒక పధకాన్ని అమలు చేస్తోంది. అయితే దాని వల్ల జనాలకు కొత్త తిప్పలు తప్ప సౌకర్యం ఏదీ సమకూరదలేదని అంటున్నారు. ఎపుడు రేషన్ తమ ఇంటికి వస్తుందో తెలియక జనాలు కళ్ళకు వత్తులు వేసుకుని చూడడమే కాదు, తమ పనులు పోయాయని తిట్టుకుంటున్నారు.

మరి ఈ పధకం ఇలా ఫెయిల్ అంది అని తెలిసి కూడా ఫ్యామిలీ డాక్టర్ పధకం అంటే మరి ఆలోచించుకోవాల్సిందే. ఏది ఏమైనా ప్రచార యావను ఆర్భాటాన్ని తగ్గించుకుంటే మంచి ఆలోచనలు పుడతాయి. అపుడు ఏలికలు జనాల మనసెరిగి వారు కోరిన విధంగా చేయడానికి చూస్తారు. అంతే తప్ప తమ బొమ్మ కనిపించాలని, తమ పేరు ప్రజలలో నలగాలని చేసే ప్రచారాలకు ఓట్లు రాలవు, జనాల మెప్పూ దక్కదని అంటున్నారు