Begin typing your search above and press return to search.

మండ‌లి ర‌ద్దు ఎప్ప‌టికి? భిన్న వాద‌న‌లు! ఎవ‌రిది రైటు?

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:32 AM GMT
మండ‌లి ర‌ద్దు ఎప్ప‌టికి? భిన్న వాద‌న‌లు! ఎవ‌రిది రైటు?
X
ఏపీ శాస‌న‌ మండ‌లిని ర‌ద్దు చేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. మండ‌లి ర‌ద్దు గురించి ముఖ్య‌మంత్రి ఏమైనా పున‌రాలోచిస్తారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది. అయితే అలాంటి అవ‌కాశ‌మే లేకుండా మండ‌లిని ర‌ద్దు చేస్తూ... కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఇక శాస‌న‌స‌భ‌లో కేబినెట్ నిర్ణ‌యానికి ఆమోద ముద్ర‌ప‌డ‌టం పెద్ద క‌థే కాదు. మండ‌లి ర‌ద్దు కు అలా రెండు ప్ర‌ధాన అంకాలు తేలిక‌ గా ముగిసిన‌ట్టే. అయితే ఇంత‌టితో మండ‌లి ర‌ద్దు అయిపోదు అనే విష‌యం ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

దీనికి కేంద్రం ఆమోద ముద్ర ప‌డాల్సి ఉంది. రాష్ట్రాల స్థాయిలో ఇలాంటి స‌భ‌ల ఏర్పాటుకు, ర‌ద్దుకు.. రెండింటికీ కేంద్రం ఆమోద ముద్ర ఉండాల్సిందే అని స్ప‌ష్టం అవుతూ ఉంది. ఈ నేప‌థ్యంలో ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యానికి కేంద్రంలో ఎప్ప‌టికి ఆమోద‌ముద్ర‌ప‌డుతుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

ఈ విష‌యంలో తెలుగుదేశం వాళ్లు ఇప్ప‌టికే చాలా రియాక్ట్ అయ్యారు. ఒక‌రేమో ఆరు నెలలు ప‌డుతుందంటే, మ‌రి కొంద‌రు ఏడాది అంటున్నారు. ఇంకొంద‌రు ఏడాదిన్న‌ర అని మొద‌లుపెట్టి.. మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా వ్యాఖ్యానించారు. మండ‌లి ర‌ద్దు గురించి అలా తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని, కేంద్రం ఆమోద ముద్ర ప‌డే వ‌ర‌కూ మండ‌లి మ‌నుగ‌డ కొన‌సాగుతుంద‌ని చెప్పుకొచ్చారు. మండ‌లి ర‌ద్దు వ‌ల్ల తెలుగు దేశం పార్టీకి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే ఏర్ప‌డుతుంది. ఈ నేప‌థ్యం లో మండ‌లి ర‌ద్దు కు కేంద్రం ఆమోద ముద్ర ప‌డ‌టం అంత తేలిక కాద‌ని వారు చెబుతున్నారు.

అయితే ప్ర‌భుత్వం ఆలోచ‌న మాత్రం వేరేగా ఉంద‌ని స్ప‌ష్టం అవుతోంది. అతిత్వ‌ర‌లో పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు లోక్ స‌భ, ఇటు రాజ్య‌స‌భ రెండూ స‌మావేశం కాబోతున్నాయి. ఆ స‌మావేశాల్లోనే ఏపీ మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని పెట్టాల‌నేది ఏపీ ప్ర‌భుత్వం ఆలోచ‌న కావొచ్చు. ఆ ఆలోచ‌న‌తోనే ఇప్పుడు మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని ఏపీ లో ఆమోదిస్తూ ఉండ‌వ‌చ్చు. మ‌రి ప్ర‌భుత్వం అనుకున్న‌ట్టుగా వ‌చ్చే పార్లమెంట్ స‌మావేశాల‌తోనే మండ‌లి ర‌ద్దుకు ఢిల్లీలో ఆమోద ముద్ర‌ ప‌డుతుందా, లేక తెలుగుదేశం చెప్పిన‌ట్టుగా సుదీర్ఘ కాలం ప‌డుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం!