Begin typing your search above and press return to search.

చంద్రబాబు నివాసానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు

By:  Tupaki Desk   |   13 Oct 2020 4:30 PM GMT
చంద్రబాబు నివాసానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు
X
చంద్రబాబు ఇంటికి మరోసారి జగన్ సర్కార్ నోటీసులు జారీ చేసింది. కృష్ణా నది కరకట్ట లోపల వైపు ఉండే నివాసాలకు వైసీపీ ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సైతం అధికారులు స్వయంగా వెళ్లి నోటీసులు ఇచ్చారు.

కృష్ణానది ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా కరకట్టపై ఉన్న ఆయన నివాసంతో పాటు మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడున్న వారంతా ఇళ్లను ఖాళీ చేయాలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. గతంలోనూ కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటించారు. ప్రస్తుతం కృష్ణానదిలో 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉన్నందున ఈ నోటీసులు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం పెరుగతోంది.

భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం చేరుకుంది. భారీ వర్షాలు, వరదలతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 2.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలోనే కృష్ణా నది కరకట్టపై ఉన్న నిర్మాణాలను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా అధికారులు తేల్చి చెప్పారు. ఇంటికి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

గత సెప్టెంబర్ లోనూ చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. గత ఏడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ఈ నోటీసులు పంపారు. ఇది అప్పట్లో రాజకీయ దుమారం రేపింది. ఈ తరుణంలో మరోసారి చంద్రబాబు ఇంటికి జగన్ సర్కార్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంమైంది.