Begin typing your search above and press return to search.

అమరావతి అభివృద్ధికి వైసీపీ ఓకే...?

By:  Tupaki Desk   |   2 April 2022 10:34 AM GMT
అమరావతి అభివృద్ధికి వైసీపీ ఓకే...?
X
ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి వైసీపీ సర్కార్ సుముఖంగా ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హై కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో అమరావతి రాజధాని అభివృద్ధి మరో నాలుగేళ్ల పాటు గడువు కావాలని కోరారు. సీఆర్డీయే చట్టం ప్రకారం చూసుకున్నా 2024 జనవరి వరకూ గడువు ఉందని పేర్కొన్నారు.

దాంతో అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వాం హై కోర్టు తీర్పునకు కట్టుబడి ఉందని అర్ధమవుతోంది. తమది మూడు రాజధానుల విధానం అని ఆ పార్టీ నేతలు ఒక వైపు చెబుతున్నారు. మరో వైపు చూస్తే అమరావతి రాజధాని విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. అక్కడ కూడా వైసీపీ నాయకులు తమ స్టాండ్ త్రీ క్యాపిటల్స్ అని చెప్పారు.

దీని మీద సుప్రీం కోర్టుకు వెళ్తారా అని కూడా అంతా అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అప్పీల్ ఆలోచనలు పెట్టుకోదలచుకోలేదు అని అర్ధమవుతోంది. అదే టైం లో అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లుగా కూడా అఫిడవిట్ దాఖలు బట్టి తెలుస్తోంది. అయితే హై కోర్టు తుది తీర్పులో పేర్కొన్న ప్రకారం ఆరు నెలల వ్యవధిలో అన్నీ చేయలేమమి, తమకు గడువు ఇస్తే చేయగలమని మాత్రమే సమీర్ శర్మ ద్వారా చెబుతోంది.

మరి దీన్ని బట్టి చూస్తే అమరావతి అభివృద్ధిని చేసి రాజధానిగా అంగీకరిస్తే మూడు రాజధానుల ప్రితిపాదన కేవలం మాటలకే ఉంటుందా అన్నది చూడాలి. హై కోర్టు తీర్పు ఉండగా మాత్రం మూడు రాజధానుల మీద అడుగు ముందుకు వేయలేని స్థితి. ఆ తీర్పు మీద సుప్రీం కోర్టులో సవాల్ చేస్తేనే వైసీపీ సర్కార్ కి అనుకూలంగా అక్కడ తీర్పు వస్తేనే ముందుకు కదిలే పరిస్థితి ఉంది.

దీని మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ లక్షల కోట్లను ఒకే చోట వెచ్చించి రాజధాని అభివృద్ధి చేయలేమని చెబుతున్నారు. ఇంకో వైపు కర్నూల్ లో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తమని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అంటున్నారు. వీటిని బట్టి చూస్తూంటే వైసీపీ మూడ్ ఏంటి అన్నది అర్ధం కావడంలేదనే అంటున్నారు. మొత్తానికి అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లు అయింది అంటున్నారు.