Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బాదుడు రెడీ.. నడ్డి విరగాల్సిందే...?

By:  Tupaki Desk   |   13 April 2022 9:30 AM GMT
ఆర్టీసీ బాదుడు రెడీ.. నడ్డి విరగాల్సిందే...?
X
బాదుడే బాదుడు అంటూ పాదయాత్ర వేళ జగన్ విపక్ష నేత హోదా చంద్రబాబు సర్కార్ ని ఎక్కడ పడితే అక్కడ సభ పెట్టి ఆడిపోసుకున్నారు. పెద్ద నోరు చేసి మరీ ఎన్నో మాటలు అన్నారు. నిజమే నాటి సర్కార్ కూడా పన్నులను పెంచింది. బాదుడు అంటూ సగటు మనిషిని ఇబ్బంది పెట్టింది. మరి నాడు నీతులు చెప్పిన వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అని జనాలు అనుకుంటారు.

కచ్చితంగా బాదుడు నుంచి ఉపశ‌మనం ఉంటుందని భావిస్తారు కదా. కానీ ఇపుడు అంతా రివర్స్ అన్న మాట. నాడు చంద్రబాబు బాదుడుని ఒక లెవెల్ లో ఉంచితే దాన్ని పీక్స్ తీసుకెళ్తోంది జగన్ సర్కార్ అంటున్నారు. చెత్త పన్ను, ఆస్తిపన్ను, భూముల ధరల బాదుడు, రిజిస్టేషన్ చార్జీల బాదుడు, విద్యుత్ చార్జీల మోత, ఇపుడు ఆర్టీసీ చార్జీల మోత ఇలా బాదుడుకు కాదేదీ అనర్హం అన్న తీరున జగన్ సర్కార్ నడ్డి విరిచేస్తోంది.

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతోంది. ఏ కోశానా ఎక్కడ కూడా ఆదాయం పెంచుకోలేదు. దాని గురించి ఆలోచిస్తున్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. అదే టైమ్ లో అప్పులు తెచ్చి పప్పు కూడు వండుతున్నారు. ఏ నెలకు ఆ నెల ఉద్యోగుల జీతాలకు చూసుకోవాల్సిన పరిస్థితి. ఇంకో వైపు నెత్తిన పెట్టుకున్న బరువు, రేపటి రాజకీయం కోసం ముందే చేసే ఖర్చు అన్నట్లుగా సర్కార్ వారి సంక్షేమ పధకాలు అలా సాగిపోవాల్సిందే.

అక్కడ ఏమీ మిగలదు, ఇక అభివృద్ధి అన్న ఊసే లేదు, పారిశ్రామికంగా, వ్యవసాయికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే రేపో ఎల్లుండో ఆదాయం సర్కార్ కి వచ్చి తీరుతుంది. అలాంటి ప్రణాళికలు అయితే లేవు అంటున్నారు. దాంతో చాలా ఈజీగా ఆదాయం వచ్చే మార్గాలకు తెర తీశారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపధ్యంలో ఒక్కో రంగం మీద ఇబ్బడి ముబ్బడిగా బాదుడు కార్యక్రమంతో వసూళ్ళు చేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇపుడు ఆర్టీసీ వంతు వచ్చింది. పల్లె వెలుగు నుంచి సూపర్ డీలక్స్ బస్సుల దాకా అన్నింటి మీద పది నుంచి పాతిక శాతం టికెట్ ధరల మీద బాదుడు ఉంటుంది అని తెలుస్తోంది.

నిజంగా ఎర్ర బస్సులు సామాన్యుడి రధచక్రాలు. వాటి చార్జీలు పెంచితే నడ్డి విరగడమే. ఎవరూ తట్టుకోలేరు. కానీ అదే సామాన్యుడు ప్రభుత్వ రధాన్ని కూడా లాగాలి. అందుకే ఈ బాదుడుని భరించి తీరాల్సిందే. కరోనా కాలం నుంచి కేంద్రం లేటెస్ట్ గా పెంచిన ఇంధన ధరల ఖర్చుల వరకూ అన్నీ కూడా కవర్ అయ్యేలా వీర లెవెల్ లో ఎర్ర బస్సు బాదుడు ఉంటుంది అంటున్నారు. సో భరించడానికి అంతా రెడీ అయిపోవడమే.