Begin typing your search above and press return to search.

వైసీపీ సర్కారు ఇంత లేటుగానా రియాక్టయ్యేది?

By:  Tupaki Desk   |   9 May 2022 7:30 AM GMT
వైసీపీ సర్కారు ఇంత లేటుగానా రియాక్టయ్యేది?
X
రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర బొగ్గు కొరత పట్టి పీడిస్తోంది. బొగ్గు నిల్వలు తగ్గిపోవటం వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవటంతో కరెంటు కోతలు తప్పటం లేదు. దేశవ్యాప్తంగా 190 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుంటే సుమారు 120 కేంద్రాల దగ్గర బొగ్గు నిల్వలు లేవన్నది వాస్తవం.

మామూలుగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపడా ఉండాలి. అలాంటిది ఇపుడు ఒకటి, రెండు రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ఇందులో భాగంగానే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాకు టెండర్లు పిలిచినట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. బొగ్గు కొరతను అధిగమించేందుకు 31 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు టెండర్లు పిలిచామన్నారు.

ఏపీ జెన్కోకు 18 లక్షల టన్నుల బొగ్గు, ఏపీ విద్యుత్ అభివృద్ధి సంస్ధ లిమిటెడ్ 13 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుండి దిగుమతి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అవసరమైన బొగ్గు అందగానే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది కాబట్టి పరిశ్రమల పవర్ హాలిడేని ఎత్తేస్తామని మంత్రి చెప్పారు. అంతా బాగానే ఉందికానీ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు దిగుమతికి టెండర్లు పిలవటంలో ఎందుకింత ఆలస్యమైందో అర్ధం కావటంలేదు.

ఒకవైపు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించి సుమారు నెలరోజులవుతోంది. విద్యుత్ సమస్య, బొగ్గు నిల్వల కొరత దేశమంతా ఉన్నది వాస్తవమే. కానీ దాన్ని అధిగమించేందుకు ఎంత స్పీడుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నదే కీలకం. బొగ్గు కొరత వస్తుందని ముందే తెలుసు.

కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుందనీ తెలుసు. అలాంటపుడు ముందుగానే బొగ్గు సరఫరాకు టెండర్లు పిలిస్తే సమస్యను అధిగమించినట్లయ్యేది కదా. పెట్టే ఖర్చు ఎలాగూ పెడుతున్నపుడు అదేదో ముందుగానే మేల్కొనుంటే ఇంత సమస్య ఉండేదికదా ?