Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ముందుకు 11 బిల్లులు..కరెంటు బిల్లుపైనే ఫోకస్

By:  Tupaki Desk   |   3 Dec 2020 11:58 AM GMT
అసెంబ్లీ ముందుకు 11 బిల్లులు..కరెంటు బిల్లుపైనే ఫోకస్
X
ఓ వైపు గడ్డకట్టే చలితో ఏపీ ప్రజలు వణికిపోతుంటే....మరోవైపు వాడీవేడిగా జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తొలి రెండు రోజులు మాదిరిగానే మూడో రోజు సభలోనూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. తొలి రెండు రోజులు జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ విధించగా...మూడో రోజు సమావేశాల సందర్భంగా టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. బిల్లులపై సరైన చర్చ జరపడం లేదన్న కారణంతో సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని టీడీపీ సభ్యులు తెలిపారు. సభ్యుల వాకౌట్ అనంతరం ప్రారంభమైన సభల ఈ రోజు 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఆయా బిల్లులను సంబంధిత శాఖా మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును మంత్రి బాలినేని..అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టాన్ని ఉప ముఖ్యమంత్రి థర్మాన కృష్ణదాస్ , ఏపీ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ థర్డ్ అమైండ్ మెంట్ ను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు ప్రవేశపెట్టారు. ఆ బిల్లులను సభ ఆమోదించింది.

యానిమల్ ఫీడ్, క్వాలిటీ కంట్రోల్ బిల్లును మంత్రి సీదిరి అప్పలరాజు, దిశ బిల్లును హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. చరిత్రాత్మకమైన వ్యవసాయ కౌన్సిల్ బిల్లును మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రైతులకు మేలు చేకూర్చే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కన్నబాబు తెెలిపారు. దేశానికే వెన్నెముక వంటి వ్యవసాయరంగానికి కౌన్సిల్ అవసరమని, ఆ కౌన్సిల్ ద్వారా రైతులకు విలువైన సలహాలు, సూచనలు అందుతాయని అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కూడా కౌన్సిల్ పరిధిలో ఉంటాయని సభలో వెల్లడించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుపై అపోహలొద్దని, ఈ బిల్లుతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందించాలంటే సౌర విద్యుత్ తప్పనిసరని, సౌర విద్యుత్ తో పర్యావరణానికి, రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు సంబంధించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరామన్నారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం మంచి నిర్ణయమని, ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుపై విపక్ష సభ్యుల సలహాలు స్వీకరించేందుకు సిద్ధమని అన్నారు.