Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఖాతాల్లోకి డ‌బ్బులు ! దీనిపైనా విమర్శలు

By:  Tupaki Desk   |   29 July 2022 5:30 AM GMT
మ‌ళ్లీ ఖాతాల్లోకి డ‌బ్బులు ! దీనిపైనా విమర్శలు
X
వ‌రుస‌గా సంక్షేమ ప‌థ‌కాల‌తో ముందుకు వెళ్తున్న ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇవాళ కాపు నేస్తం పేరిట నిధులు విడుద‌ల చేయ‌నుంది. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా, గొల్ల ప్రోలులో ఇవాళ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కాపునేస్తం నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సీఎం జ‌మ చేస్తారు. అటుపై సీఎం ప్ర‌సంగిస్తారు. కాపు నేస్తం కింద ఈ ఏడాది ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లకు పైగా విడుద‌లకు రంగం సిద్ధం అయింది. వైఎస్సార్ కాపు నేస్తం పేరిట గ‌డిచిన మూడేళ్లుగా నిధులు విడుద‌ల చేస్తూ ఉన్నారు.

45 నుంచి 60 ఏళ్ల లోపు కాపు, బ‌లిజ, తెల‌గ, ఒంట‌రి కులాల‌కు చెందిన పేద మ‌హిళ‌ల‌కు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ ప‌థ‌కాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇందుకు ఇప్ప‌టిదాకా 1491.93 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చిస్తూ ఉన్నారు. ఇప్ప‌టిదాకా 3, 38,792 మందికి లబ్ధి చేకూరింది అని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి. కాపు నేస్తం ప‌థ‌కం కింద ఒక్కో ల‌బ్ధిదారుకు నెల‌కు ప‌దిహేను రూపాయ‌లు చొప్పున ఐదేళ్ల కాలానికి 75 వేల రూపాయ‌లు అందించ‌నున్నారు.

దాదాపు ఐదారు జిల్లాల‌లో ప్ర‌బ‌లంగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గంను త‌మ వైపు ఆక‌ట్టుకునేందుకు ఏటా ఈ ప‌థ‌కం అమలు చేస్తున్నారు కాని వారిపై ఏ ప్రేమ లేదని జనసేన ఆరోపిస్తోంది.

వాస్త‌వానికి ప్ర‌స్తుత ప్ర‌భుత్వం వ‌చ్చాక సంక్షేమ క్యాలెండ‌ర్ ను త‌ప్ప‌క అమ‌లు చేస్తుంది! అభివృద్ధి ప‌నుల‌పై అస్స‌లు దృష్టే లేదని ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తోంది. ముఖ్యంగా బీసీ కార్పొరేష‌న్ ను పూర్తిగా నిర్వీర్యం చేసి, నిధులు విడుద‌ల చేస్తూ ఉన్నారు. వివిధ పథ‌కాల పేరిట నేరు ల‌బ్ధి ఇస్తున్నామ‌ని చెబుతున్నారు కానీ వాస్త‌వం అయితే అలా లేదని బీసీ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.. ఇప్ప‌టికీ అర్హ‌త ఉన్నా కూడా ప‌థ‌కాలు అంద‌ని దాఖలాలు కోకొల్ల‌లున్నాయని వారు అంటారు. బీసీలను ఎదగడానికి చేయాల్సిన పనులు ప్రభుత్వం విస్మరించి సంక్షేమంతో ఓదారుస్తోందని వారి ఆరోపణ. విప‌క్ష పార్టీల‌కు మద్ద‌తు ఇచ్చిన వారికి క‌నీసం పింఛ‌ను కూడా అందడం లేదు ప్రతిపక్షాలు గోల పెడుతున్నాయి.

సరే... జనానికే పంచుతున్నారు. బాగుంది. కానీ ప‌థ‌కాల కార‌ణంగానే ఓట్లు రాల‌వు కదా అంటున్నారు పరిశీలకులు. గ్రామీణ ప్రాంతాల రోడ్లు , మౌలిక వ‌స‌తులు ప‌ట్టించుకోకుండా ఏం చేసినా లాభం ఉండ‌ద‌ని ఓ వాద‌న విప‌క్షం నుంచి వ‌స్తోంది. కాపుల‌కు డ‌బ్బులు పంచినంత మాత్రాన వారంతా వైసీపీ వైపే ఉంటారని అనుకోలేం అని, బ్యాక్ ఎండ్ స్కీంల కార‌ణంగా ఎవ‌రి నుంచి ఎవ‌రికి డ‌బ్బులు వ‌స్తున్నాయో సంబంధిత నాయ‌కులు చెబితే కానీ అర్థం కాదు అని కూడా సొంత పార్టీలో కాపు నేతలు కూడా చెప్పడం గమనార్హం.

సంక్షేమం ఉండనీ ఎవరూ కాదనరు కానీ పూర్తిగా కొన్ని వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం చేసేందుకు ప‌థ‌కాలు వాడటటం ఏంటని తెలుగుదేశం నిలదీస్తోంది. ఆర్థిక సంబంధ నేరాలుగానే వీటిని చూడాల‌ని ఇంకొంద‌రు ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.