Begin typing your search above and press return to search.

దేశంలోనే ఫ‌స్ట్‌.. ఏపీలో లిక్క‌ర్ మాల్స్‌: కొత్త పాల‌సీ 1 నుంచే

By:  Tupaki Desk   |   25 Sep 2020 6:15 PM GMT
దేశంలోనే ఫ‌స్ట్‌.. ఏపీలో లిక్క‌ర్ మాల్స్‌:  కొత్త పాల‌సీ 1 నుంచే
X
మాల్‌.. ఈ పేరు విన‌నివారు ఉండ‌రు. మ‌న‌కు కావాల్సిన వ‌స్తువుల‌ను స్వ‌యంగా మ‌న‌మే ఎంచుకుని.. ఖ‌రీదు చూసుకుని.. బుట్ట‌లో వేసుకుని వ‌స్తూ.. వ‌స్తూ.. కౌంట‌ర్‌లో బిల్లు క‌ట్టేసే ఏర్పాటు ఉండే భారీ వ్యాపార సంస్థ‌ల(ఎలైట్ షాప్స్)‌ను మాల్స్‌గా పిలుస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు జీవీకే మాల్‌.. డీ మార్ట్‌.. స్పెన్స‌ర్ వంటివి మ‌న‌కు తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఇలాంటి మాల్స్‌నే ఏపీ స‌ర్కారు స్వ‌యంగా ఏర్పాటు చేయనుంది. పెద్ద పెద్ద భ‌వ‌నాలను అద్దెకు తీసుకుని.. అంగ‌రంగ వైభ‌వంగా వాటిని సుంద‌రీక‌రించి.. మాల్స్ వాతావ‌ర‌ణం క‌ల్పించ‌నుంది. అయితే, ఈ మాల్స్ దేనికోస‌మంటే.. మ‌ద్యం కోసం!

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేని విధంగా `లిక్క‌ర్ మాల్స్‌`కు ఏపీ స‌ర్కారు శ్రీకారం చుట్టింది. తాజాగా తీసుకువ‌చ్చిన నూత‌న మ‌ద్యం పాల‌సీలో మాల్స్‌కు పెద్ద‌పీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే నెల రోజుల్లో ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో 80 లిక్క‌ర్‌ మాల్స్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్టు తాజా పాల‌సీలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మాల్స్‌లో లోక్లాస్‌, ప్రీమియం బ్రాండ్లు కాకుండా.. వాటిని మించిన ఖ‌రీదైన బ్రాండ్ మ‌ద్యాన్ని, విదేశీ మ‌ద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. గాజు అద్దాల షోరూంలా.. రంగు రంగుల విద్యుత్ లైట్ల కాంతుల్లో ఉండే మాల్‌లో లిక్క‌ర్ బాటిళ్ల‌ను అందంగా పేర్చ‌నున్నారు.

మ‌ద్యం ప్రియులు.. మాల్‌లోకి నేరుగా వెళ్లి.. వారికి న‌చ్చిన, కోరుకున్న‌ బాటిల్‌ను బుట్ట‌లో వేసుకుని బిల్లు క‌ట్టి ఎంచ‌క్కా వ‌చ్చేయొచ్చు. క్యూలో నిల‌బ‌డ‌డం, ఒక‌రిపై ఒక‌రు ప‌డి తోసుకోవ‌డం వంటివి ఉండవు. ఈ పాల‌సీ వ‌చ్చే నెల 1 నుంచి అమ‌ల్లోకి రానుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, ఈ షాపుల ఏర్పాటు ద్వారా ప్ర‌స్తుతం ఉన్న షాపుల సంఖ్య‌(2934) పెర‌గ‌బోద‌ని స‌ర్కారు స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు మ‌ద్య నియంత్ర‌ణ నేప‌థ్యంలో గ‌త ఏడాది 20 శాతం మ‌ద్యందుకాణాల‌ను త‌గ్గించిన ప్ర‌భుత్వం ఈ ఏడాది మాత్రం కేవ‌లం 13 శాతానికే ప‌రిమిత‌మైన‌ట్టు క‌నిపిస్తోంది.

క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత‌.. ఓపెన్ చేసిన మ‌ద్యం వ్యాపారాల‌కు సంబంధించి తీసుకున్న నిర్ణ‌యంలో ఈ ఏడాది లిక్క‌రు షాపుల సంక్య‌ను 13 శాతం త‌గ్గించారు. వాస్త‌వానికి ఏటా 20శాతం త‌గ్గించి..ఐదేళ్లలో పూర్తిగా మ‌ద్య నిషేధం చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది 20శాతం మేర‌కు షాపులు త‌గ్గించినా.. ఈ ఏడాది మాత్రం 13 శాతం త‌గ్గించారు. పైగా తాజా పాల‌సీలో షాపుల కుదింపున‌కు సంబంధించి ఎలాంటి విష‌య‌మూ పేర్కొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి ఈ ఏడాది షాపుల కుదింపు 13 శాతానికే ప‌రిమితం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక‌, సాధార‌ణ మ‌ద్యం అమ్మ‌కాలు, బార్లు.. య‌థావిధిగా ఉంటాయి. వీటిలో ఎలాంటి మార్పూ లేద‌ని నూత‌న మ‌ద్యం పాల‌సీలో స్ప‌ష్టం చేశారు.