Begin typing your search above and press return to search.

ఆరోగ్య విశ్వవిద్యాలయాల పితామహుడు ఎన్టీయార్... అలాంటి ఆయన్ని...?

By:  Tupaki Desk   |   22 Sep 2022 7:34 AM GMT
ఆరోగ్య విశ్వవిద్యాలయాల పితామహుడు ఎన్టీయార్... అలాంటి ఆయన్ని...?
X
ఆయన అప్పటి ట్రెడిషనల్ పాలిటిక్స్ ని బద్ధలు కొట్టారు. కేవలం ఫైల్స్ లో ఉన్నవి బుక్ రూల్స్ లో ఉన్నవి మాత్రమే చట్టాలుగా చేసి జనాలను పాలించడం తన వల్ల కాదు అన్నారు. ఆయన ఆ రోజుకు మూడు వందలకు పైగా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి యావత్తు సమాజం గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నారు. అలాగే తన చైతన్య రధం మీద తొమ్మిది నెలల పాటు ఆయన ఉమ్మడి ఏపీ అంతా కలియతిరిగి నేరుగా జనం కష్టాలను చూశారు. అలా ఒక విప్లవంగా ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

అంతే చైతన్యంతో ఆయన పార్టీని నడిపారు. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా ఆయన ఎవరూ చేయలేరు అనుకున్న ఎన్నో పనులు చేసి చూపారు. వైద్య కళాశాలకు ఒక విశ్వవిద్యాయలం ఉండాలన్న ఆలోచన అప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చి నలభై ఏళ్ళు అయినా మిగిలిన వారికి ఎందుకు రాలేదు. అలాంటి గొప్ప ఆలోచన వచ్చింది కాబట్టే ఆయన ఎన్టీయార్ అయ్యారు. అందుకే ఆయన విజయవాడలో 1986లో వైద్య అరోగ్య విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు. ఆయన దానికి మొదటి చాన్సలర్ కూడా.

అలా ఎన్టీయార్ అన్ని వైద్య కళాశాలను ఒక గొడుకు కిందకు తెచ్చిన తరువాత దేశం మొత్తం ఏపీ వైపు నాడు చూసింది. ఆ మీదట దేశంలో కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేశారు. అంటే భారతీయ ఆరోగ్య విశ్వవిద్యాలయాల పితామహుడిగా ఎంటీయార్ ఎప్పటికీ చరిత్ర పుటలలో ఉంటారన్నమాట. అలాంటి ఎన్టీయార్ కి సొంత రాష్ట్రంలో ఆయన చనిపోయిన ఇరవై ఆరేళ్ళ తరువాత గౌరవం ఇవ్వలేని పరిస్థితి వచ్చినంటే దానికి తెలుగు వారు అన్న వారంతా చింతించాలా లేక రోదించాలా అన్నది ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.

వైఎస్ జగన్ సర్కార్ ఒకే ఒక్క బిల్లు తో ఎన్టీయార్ పేరిట ఉన్న విశ్వ విద్యాలయం పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టేసింది. ఇది నిజంగా ఎంత తప్పు అన్నది అందరికీ తెలుసు ఏలిన వారికి తప్ప. ఎంటీయార్ అంటే పాలనా దక్షుడుగా చెప్పుకోవడానికి విప్లవాత్మకమైన ఆలోచనలు చేసే గొప్ప మేధస్సు కలిగిన వారుగా చూపించడానికి ఈ విశ్వవిద్యాలయం ఒక సంకేతం. ముందు తరాలకు ఆయన అలా ఒక స్పూర్తి. మరి అలాంటి ఎన్టీయార్ ఏం పాపం చేశారని ఆయన పేరును వర్శిటీకి తొలగించడం అన్నది అందరి మదిని దొలిచేస్తున్న ప్రశ్న.

జగన్ ఇక్కడ తన తండ్రి వైద్య రంగానికి ఎంతో చేశారని చెప్పవచ్చు. ఆయన గురించి వేయి రకాలుగా పొగుడుకోవచ్చు. అందులో తప్పు లేదు, కానీ ఆయన పేరుని ఎన్టీయార్ వర్శిటీకి పెట్టడం మాత్రం ఆయన ఏ రకంగానూ సమర్ధించుకోలేరనే చెప్పాలి. వైస్సార్ ఆరోగ్యశ్రీకి చేసినది కానీ, వైద్య రంగానికి చేసినది కానీ ఎవరూ తక్కువ చేయడంలేదు. అదే టైమ్ లో ఆయన పేరున ఇప్పటికే ఎన్నో పధకాలను జగన్ ప్రవేశపెట్టారు.

అవసరం అయితే మరిన్ని కొత్త పధకాలకు పెట్టుకున్నా ఎవరూ ఆక్షేపించరు కూడా. ఒక్క వైద్య రంగానికే వైఎస్సార్ పేరు ఉండాలని గట్టిగా భావించినా కూడా కొత్తగా ఏదో ఒక ప్రాజెక్ట్ తలపెట్టి పెట్టుకున్నా జనం ఒప్పుకునే వారు. దాని కోసం ఒక మహానుభావుడి పేరుని తీసేయడం ఏంటి అన్నదే అందరి మాట. ఈ విషయంలో ఎవరూ జగన్ని కానీ వైసీపీ సర్కార్ ని కానీ ఎవరూ కూడా ఏ కోశానా సమర్ధించేది ఉండదు అని అంటున్నారు.

ఇక్కడ చూస్తే హెల్త్ యూనివర్శిటీ అన్న కాన్సెప్ట్ దేశంలోనే మొట్టమొదటిది, ఇది ఎన్టీఆర్ మానస పుత్రికగా కూడా అంతా చూస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఆవిష్కరించిన తర్వాతే ఇతర రాష్ట్రాలు అనుసరించాయి అంటే ఆ గొప్పతనం ఎన్టీయార్ ది కాకుండా ఎవరికి వెళ్తుంది అన్నది కూడా ఆలోచన చేయాలి. అలాంటిది ఒక్క దెబ్బకు పేరు తీసేయాలనుకోవడం విచిత్రమైన పోకడగానే అంతా చూస్తున్నారు.

ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన ఎన్టీయార్ ని తగ్గించాలని చూసారని వైసీపీ అంటోంది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన బాబు పార్టీ ఆఫీసుల నుంచి ఎన్టీయార్‌ ఫొటోలు విసిరేయడంతో పాటు పార్టీ సమావేశాల్లో ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించకపోవడం అసెంబ్లీలో ఎన్టీయార్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అలాగే, ఎన్టీయార్‌పై పాదరక్షలు విసరడం వంటివి చేశారని వైసీపీ వారు ఈ రోజు వరకూ మాట్లాడుతూ ఉన్నారు.

మరి ఎన్టీయార్ మీద మాకు ఎంతో గౌరవం ఉందని చెప్పుకునే జగన్ ఇపుడు చేసిన పనేంటి. ఆయన చేసినది చంద్రబాబు కంటే ఏమాత్రం తక్కువ తిన్నది అన్నది కూడా ఆలోచించాలి కదా. ఎన్టీయార్ పేరుని విజయవాడకు పెట్టామని జగన్ ఎంత చెప్పుకున్నా హెల్త్ వర్శిటీకి ఆయన పేరు తీసివేయడంతో అది తీసికట్టు అయింది.

ఎన్టీయార్ వంటి మేటిని, తెలుగు వారి కీర్తి పతాకను అవమానించడంతో బాబుతో తాను కూడా పోటీ పడినట్లుగా జగన్ చెప్పుకున్నట్లుగానే ఉంది. ఎన్టీయార్ పేరు జిల్లాకు పెట్టామని చెబుతూ దక్కించుకున్న క్రెడిట్ ఇక మీదట జగన్ సర్కార్ కి ఏ మాత్రం ఉండబోదు, అదే టైమ్ లో హెల్త్ వర్శిటీకి పేరు తీసేయడం అన్న మచ్చ మాత్రం చిరకాలం ఉంటుంది అని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.